వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ
సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి సూచించారు. మంగళవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వజ్ర భాస్కరరెడ్డి మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాలను రోల్‌మోడల్‌గా తీసుకుని సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలన్నారు. కమిటీల నిర్మాణానికి కార్యాచరణ, రానున్న రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలు కేంద్రంగా పనిచేసేలా రూపొందించిన విధి విధానాలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సంస్థాగత కార్యాచరణను వజ్ర భాస్కరరెడ్డి వివరించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలవాలని ఇన్‌చార్జిలకు తెలిపారు. మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడిరాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాలబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, తోటరామకృష్ణ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


