తాటిచెట్లపాలెం (విశాఖ): విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ.కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్‌లో జేఎల్‌ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తూ మరణించిన ఆరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అనుబంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని, సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఎస్‌బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఎ.శ్రీనివాస్, ఎల్.అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌కు సీఐ రాంబాబు
నల్లజర్ల: స్థానిక సీఐ వై.రాంబాబు వీఆర్‌కు వెళ్లారు. ప్రసుత్తం ఆ బాధ్యతలను దేవరపల్లి సీఐ నాగేశ్వరావునాయక్‌కు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో సీఐలు, ఎస్‌ఐలు రావడం, పోవడం పరిపాటిగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారనే విషయం స్థానికులకు సైతం తెలియకుండా పోయింది. అపుడే దాదాపు ఐదారుగురు సీఐలు, పది మందికి పైగా ఎస్‌ఐలు మారుతూనే ఉన్నారు. కారణం ఏమిటో తెలియడం లేదని స్ధానికులు అంటున్నారు. కోడిపందాలు, పేకాటలు, జూదాలు, డ్రగ్స్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక, మట్టి మాఫియా అన్నీ ఈ మండలంలోనే ఉన్నాయి. వీటన్నింటిని చూసీచూడనట్టు ఉంటేనే ఇక్కడ ఏ అధికారి అయినా ఉద్యోగం చేయగలుగుతారు. లేకుంటే మర్నాడే వేరే చోటికి బదిలీ కావాల్సిందేనన్న విమర్శలు బహిరంగంగా వినపడుతున్నాయి. ప్రస్తుత సీఐకు కూడా ఈవిధంగానే వీఆర్ జరిగిందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. సీఐ వీఆర్‌కు వెళ్లిన సంగతి ఇంతవరకు గోప్యంగానే ఉంది.
పాఠశాలలో శిలాఫలకం ధ్వంసం
ముమ్మిడివరం: కొమానపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో సుమారు రూ.50 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ ఘటణకు కారకులైన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమవారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్‌రిజిస్ట్రార్‌గా పదోన్నతి
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్‌రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాయలం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న టి.గణేష్‌బాబును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించారు. కాకినాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాయలంలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసమూర్తిని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించారు.


