కోరుకొండ: వ్యవసాయ రంగంలో రైతన్నకు నానాటికీ కష్టాలు పెరుగుతున్నాయి. కూటమి పాలనలో రైతు దగాకు గురవుతూనే ఉన్నాడు. విత్తన కంపెనీల కారణంగా నష్టాలపాలు కావాల్సి వస్తుంది. మెట్ట ప్రాంతమైన గోకవరం, సీతానగరం మండలాల్లో విత్తన కంపెనీల కారణంగా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో 330 మంది రైతులు, 1,150 ఎకరాల్లో సాగుచేసిన వరి పంటకు అగ్గితెగులు సోకింది. ఖరీఫ్ సాగులో దిగుబడి తగ్గడంతో రబీసాగుపై నమ్మకం పెట్టుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. కార్పొరేట్ విత్తన కంపెనీల రూపంలో రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వ్యవసాయశాఖ కోరుకొండ సబ్–డివిజన్‌లో కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలున్నాయి. ఈసబ్ డివిజన్‌లో 10,150 మంది రైతులు రబీ సీజన్‌లో 21,526 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. కాగా కోరుకొండ మండలంలో 5,621 ఎకరాలు, సీతానగరం మండలంలో 11,022 ఎకరాలు, గోకవరం మండలంలో 4,883 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే అగ్గితెగులు కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెదుతున్నారు. గింజ పెరిగే దశలోని చేలల్లో, పుష్పగుచ్ఛానికి ఆహారం వెళ్లకుండా అడ్డుకుంటుందన్నారు. దీంతో తాలు, తప్ప గింజలు మాత్రమే రైతులకు దక్కుతాయని గగ్గోలు పెడుతున్నారు. ఈకారణంగా పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు ఇటీవల వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫిర్యదు చేశారు. విత్తన దుకాణాల కారణంగానే నష్టపోయినట్టు రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు.
శాస్త్రవేత్తలకు పంపాం
గోకవరం, సీతానగరం మండలాల్లోని రైతుల ఫిర్యాదు మేరకు విత్తనాల విషయమై శాస్త్రవేత్తలకు ఫిర్యాదులను పంపాము. వారు వచ్చి పంటపొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ధారణ చేస్తారు. అలాగే సమస్యను వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్య నిర్దిష్టంగా తంటికొండ, గాదెలపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. అగ్గితెగులు కారణంగా ఆశించినంత దిగుబడి రాదు. తాలు, తప్పలు మాత్రమే వస్తాయి.
– డి.శ్రీనివాసరావు,
వ్యవసాయశాఖ ఏడీ, కోరుకొండ
నకిలీ విత్తనాలే కారణమంటున్న రైతులు
గోకవరం, సీతానగరం మండలాల్లో 1,150 ఎకరాల్లో పంట నష్టం
పొలాలను పరిశీలించిన అధికారులు
వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఫిర్యాదు


