ప్రకాశం నగర్: మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదని, పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు ఎరజ్రెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆరవ మహాసభ నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్ స్టేడియం నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తాడితోట సెంటర్, బైపాస్ రోడ్డు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటలు పని సమయాన్ని పెంచడం దారుణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి గిఫ్ట్‌గా మహిళపై భారం మోపేందుకే గ్యాస్ ధరలను అమాంతంగా పెంచారని, వంటగ్యాసుపై రూ.60, కమర్షియల్ గ్యాస్ బండపై రూ.115 పెంచడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ప్రజలు మరిచిపోరన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్ మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్రం నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కిన లోకేష్ బాబు మాట మార్చి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపాల్ కార్మిక నాయకులు తమ ఐక్యతను చాటారు. ఈ బహిరంగ సభకు యూనియన్ అధ్యక్షుడు అసుల రంగనాయకులు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఏసు రత్నం, పోరుమామిళ్ల సుబ్బారాయుడు, తులసేంద్ర, నెక్కంటి సుబ్బారావు, కిర్ల కృష్ణరావు, తాటిపాక మధు, రేఖ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు.


