మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
దేవరపల్లి: కోకో గింజల ధర పతనమైంది. మొన్నటి వరకు కిలో గింజలు రూ.350 నుంచి రూ.400 ధర పలుకగా, ప్రస్తుతం రూ.170 నుంచి రూ.270 పలుకుతోంది. దీంతో రైతులు కోలుకోలేక విలవిలలాడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి. కంపెనీలు సిండికేట్ కావడం, గిట్టుబాధ ధర ఇవ్వకపోవడం, అన్నింటి కంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోకో రైతులు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 2023–24 పంట కాలంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కోకో పంట రైతుల ఇంట కాసులు కురిపించింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండడం, కిలో గింజల ధర రూ.1,050 పలకడంతో కోకో పండించిన రైతుల పంట పండింది. ఆ ఏడాది ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్లు దిగుబడి రావడంతో సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం వచ్చింది. కొంతమంది రైతులు రూ.కోటికి పైగా ఆదాయం పొందారు. దీంతో కౌలు దారులు తోటల కోసం ఎగబడ్డారు. ఉన్న కొద్దిపాటి తోటలతో పాటు మరికొన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని 2024–25 సంవత్సరంలో రైతులు సాగు చేశారు. అయితే దిగుబడులు తగ్గడంతో పాటు, మార్కెట్లో ధర తగ్గింది. ఓ దశలో గింజలు కొనే నాథుడు లేకుండా పోయాడు.
కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా మారి కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడ గింజలు అక్కడే ఉండిపోయాయి. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయడంతో కొనుగోళ్లు నిర్వహించారు. కంపెనీలు కిలో గింజలు రూ.450కు కొనుగోలు చేయగా, ప్రభుత్వం మరో రూ.50 ఇచ్చి రైతులకు కిలో రూ.500 చొప్పున చెల్లించింది. దిగుబడులు తగ్గడం, ధర పతనం కావడంతో ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేలు రైతులు నష్టపోయారు. ఎకరం కౌలు రూ.1.25 లక్షలు కాగా, పెట్టుబడి మరో రూ. 60 వేలు అయింది. దీంతో గత ఏడాది రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు.
సాగు వివరాలు
జిల్లాలో సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు
ఉత్పత్తి లక్ష్యం 531 మెట్రిక్ టన్నులు
సాగు రైతులు 1,565 మంది
రైతు సంఘాల డిమాండ్లు
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధర ఇవ్వాలి
పండించిన పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలి
వెంకట్రామన్నగూడెంలో కోకో పరిశోధనా కేంద్రం నెలకొల్పాలి
కంపెనీల సిండికేట్ విధానాన్ని అరికట్టాలి
MóS…{§ýl, Æ>çÙ‰ {糿¶æ$™éÓË$ OÆð‡™èl$-ÌS¯]l$ ˘
ఆదుకోవాలి
పతనమైన కోకో గింజల రేటు
కోలుకోలేని స్థితిలో రైతు
కిలో రూ.270
ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి
సాగు వ్యయం రూ.2 లక్షలు
ఆదాయం రూ.54 వేలే
నష్టం రూ.1.46 లక్షలు
13,500 ఎకరాల్లో సాగు
గొల్లుమంటున్న రైతులు
రైతుల్లో చైతన్యం రావాలి
కోకో రైతుల్లో చైతన్యం రావాలి. మంచుకు పూతలు మాడిపోయాయి. కొత్త పూతలు లేవు. ఎకరాకు రెండు క్వింటాళ్లు దిగుబడి రావడం కష్టం. కౌలు రైతులు గొల్లుమంటున్నారు. నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఎకరాకు కౌలు రూ.1.25 లక్షలు, పెట్టుబడి రూ.80 వేలు అయింది. ఆదాయం రూ.54 నుంచి రూ.60 వేలు వస్తోంది. ఎకరాకు సుమారు 1.50 లక్షలు నష్టం వస్తుంది. కోకో రైతుల మొరను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రైతుల్లో చైతన్యం వస్తేనే గాని సమస్యకు పరిష్కారం దొరకదు.
– ఉప్పల కాశీ, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కోకో రైతు సంఘం, కోరుమామిడి, నిడదవోలు మండలం
కొనే నాథుడు లేడు
కోకో గింజలు కొనే నాథుడు లేడు. ఎక్కడ గింజలు అక్కడే ఉన్నాయి. కంపెనీలు రావడంలేదు. ఒకే కంపెనీ ప్రతినిధులు వచ్చి నచ్చిన గింజలు అక్కడక్కడా కొంటున్నారు. చిన్న రైతులను పట్టించుకోవడం లేదు. గింజలు బాగుంటే కిలో రూ.300కు కొంటున్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదు. కిలో రూ.600 ధర ఇస్తే రైతుకు పెట్టుబడులు వస్తాయి. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలి.
– కొయ్యలమూడి వేణు,
కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం
కోలుకోవడం కష్టం
ఈ ఏడాది కోకో రైతులు కోలుకోవడం కష్టం. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మార్కెట్ ఉంటుంది. వేసవిలో పండిన గింజలకు డిమాండ్ ఉంటుంది. రెండేళ్లుగా కోకో గింజలు అమ్ముకోవడానికి రైతులు నానావస్థలు పడుతున్నారు. రైతుల మొర చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించడం లేదు.
– గడా రాంబాబు, వైఎస్సార్ సీపీ
రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి,
చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం
పూతలకు దోమపోటు
కోకో పూతలకు దోమపోటు తగిలింది. తోటలకు తెల్లదోమ వ్యాపించడం, మంచు ఎక్కువగా కురవడంతో పూతలు దెబ్బతిన్నాయి. పూతలు మాడిపోవడంతో కాపులు తగ్గాయి. జిల్లాలోని రైతులు కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది కౌలు దారులున్నారు. మార్కెట్ బాగుంటే ప్రధాన పంట కంటే కోకోకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 2023–24లో మార్కెట్ బాగుండి నాలుగు డబ్బులు మిగిలాయి. 2022–23 పంట కాలంలో కిలో గింజలు రూ.250 నుంచి రూ.275 ధర ఉండగా, 2023–24 సీజన్‌లో ఊహించని విధంగా మార్కెట్లో ధర పలికింది. 2024–25 పంట కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ప్రస్తుత పంట కాలంలో ధరతో పాటు దిగుబడులు లేక విలవిలలాడుతున్నారు. ఎకరాకు 2 క్వింటాళ్లు రావడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు దెబ్బకు పూతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు పండించిన కోకో గింజలను క్యాడ్‌బరీ సంస్థ ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.


