సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): భాషా రాష్ట్రం సాధన కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నతుడు పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కీర్తి కొనియాడారుయ. కలెక్టరేట్‌లో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పాల్గొన్నారు.
నేడు వైఎస్సార్ సీపీ నిరసన
రాజమహేంద్రవరం రూరల్: మోరంపూడి సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన దాడికి నిరసనగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌లు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, జి.శ్రీనివాసనాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వేణుగోపాలకృష్ణ కోరారు.
‘నన్నయ’లో విద్యార్థులకు
షార్ట్ టర్మ్ శిక్షణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 45 గంటల వ్యవధితో కూడిన షార్ట్ టర్మ్ కోర్సును వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సోమవారం ప్రారంభించారు. హార్ట్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ లో ఈ నెల 25 వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 10 రోజులపాటు ఈసీఈ, ట్రిబుల్ ఈ విద్యార్థులకు యూనివర్సిటీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ప్లేస్మెంట్ అధికారి ఆచార్య బి.జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డిసీ అధికారి డాక్టర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి, హార్డ్‌వేర్ అండ్ నెట్ వర్కింగ్ ట్రైనింగ్ ఇన్‌చార్జి మహేష్ పాల్గొన్నారు.
33 పోస్టులకు
452 దరఖాస్తులు
కాకినాడ క్రైం: గత ఏడాది డిసెంబర్ 15న రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్, అల్‌లైడ్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం పది కేటగిరీల్లోని 33 పోస్టులకు 452 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ఆన్‌లైన్‌లో పొందుపరిచామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు apego@nic. in, rmckakinada.com వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన మెరిట్ లిస్టులో తమ పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలుంటే ఈ నెల 23వ తేదీ వరకూ కళాశాల పని దినాల్లో స్వీకరిస్తామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.


