దేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో పండగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్రంలోని కొండపైన గల ఏసు క్రీస్తు ఆలయం వద్ద సోమవారం మేరీమాత పతాకాన్ని ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ప్రకాష్ సంగిలి ఆవిష్కరించి పండుగ కార్యక్రమాన్ని ప్రకటించారు. అనంతరం జపమాల ధ్యానం, గురువులతో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 25 వరకు పుణ్యక్షేత్రంలో నవదిన జపాలు, దివ్యబలిపూజ, జపమాల ధ్యానం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఏలూరు బిషప్ జయరావు పొలిమెర మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రేరణ జెండా ఆవిష్కరణ అని అన్నారు. ఏటా నిర్మలగిరి మేరీ మాత్ర ఉత్సవాలకు ముందుగా మేరీమాత పతాకావిష్కరణ జరుగుతుందని చెప్పారు. పతాకావిష్కరణ పండుగకు సూచిక కాదని చెప్పారు. ఇది ఓ ఆధ్యాత్మిక ప్రకటన అని అన్నారు. మరియతల్లి ఈ ప్రాంతంలో ఉందని ఆయన అన్నారు. ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి మాట్లాడుతూ మరియతల్లి పూజా ఆరాధనల ద్వారా ప్రజావళిని, మేత్రాసులను అత్యధికంగా దీవించాలని ప్రార్థించారు. వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి.బాల, పలువురు గురువులు, మేత్రాసన కౌన్సిల్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, నిర్మలగిరి వికారియేట్ గురువులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించిన
బిషప్ జయరావు పొలిమెర
సమష్టి దివ్యపూజల బలి
నిర్వహించిన పీఠాధిపతులు


