కపిలేశ్వరపురం/సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ కొరత వార్తలు జనానికి గుబులు పుట్టిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. వీటి పంపిణీని 40 శాతం వరకూ తగ్గించేసింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌కు కొరత రానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వంట గ్యాస్‌కు ఎటువంటి కొరతా లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలు ఎవరికి వారే ముందు జాగ్రత్తగా ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్‌ల కోసం బారులు తీరుతున్నారు.
బుకింగ్‌లు రెట్టింపు
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు ప్రతి రోజూ గ్యాస్ సిలిండర్లు సాధారణ స్థాయిలోనే సరఫరా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు 11 వేల నుంచి 11,500 వరకూ గ్యాస్ రీఫిల్ బుకింగ్‌లు నమోదవుతూంటాయి. అటువంటిది ప్రస్తుతం రోజుకు 19,896 నుంచి 22,250 వరకూ నమోదవుతున్నాయి. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే గ్యాస్ బుకింగ్‌లు దాదాపు రెట్టింపయ్యాయన్నమాట. దీనినిబట్టి జనంలో ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గ్యాస్ బుకింగ్ క్షణాల్లో జరిగేది. అటువంటి ఇప్పుడు సర్వర్లు బిజీబిజీగా మారిపోవడంతో గంటలు గంటలు పడుతోంది. దీనికితోడు గతంలో బుక్ చేసుకున్న ఒక్క రోజులోనే సిలిండర్లను వినియోగదారులకు అందించేవారు. ప్రస్తుతం ముందు బుక్ చేసుకున్న వారికి ముందు అనే విధానంలో గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల బుకింగ్ చేసిన 2 నుంచి 4 రోజులకు కానీ సిలిండర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు అంటున్నారు.
వివిధ రంగాలపై ప్రభావం
వంట గ్యాస్ ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. ప్రధానంగా ఇది ఆహార వ్యాపారంపై ఇప్పటికే పడుతోంది. పలు హోటళ్లలో అత్యధికంగా గ్యాస్ వినియోగమయ్యే కొన్ని రకాల ఆహార పదార్థాల తయారీని ఇప్పటికే నిలిపివేశారు. భారీ పెట్టుబడులతో రెస్టారెంట్లు ఏర్పాటు చేసిన వారి నుంచి వీధి వ్యాపారుల వరకూ ఎవరికి వారు తమ వ్యాపారం ఏవిధంగా ఉంటుందోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కుటుంబాలు రోజువారీ ఆదాయం పైనే ఆధారపడి జీవిస్తూంటాయి. వీరు రోజువారీ ఆదాయంలో కొంత చిట్టీలు కడతారు. వంట గ్యాస్ కొరతతో వ్యాపారం మూత పడితే ఆర్థికంగా తలకిందులవుతామనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో, ఎవరికి వారే సిలిండర్లను ముందు జాగ్రత్తగా నిల్వ ఉంచుకుంటున్నారు. గ్యాస్ కొరతతో హోటల్ పరిశ్రమ దెబ్బ తింటే.. దానికి అనుబంధంగా పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాలపై ప్రభావం పడుతుంది. అలాగే, కేటరింగ్, అన్నదానాలు చేసేవారు, ఆశ్రమాలు, హాస్టళ్లు నిర్వహించే వారు ఇక్కట్లు ఎదుర్కొంటారు. జిల్లాలో పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్దా హోటళ్లు, కేఫ్‌లు కలిపి 1.20 లక్షలు ఉన్నాయి. వీటిపై సుమారు 3 లక్షల మంది శ్రామికులు ఆధారపడి జీవిస్తున్నారు.
భరోసా కల్పించాలి
గ్యాస్ వినియోగం ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. సిలిండర్ల కోసం పడిగాపులు పడే పరిస్థితులు తలెత్తితే ప్రజలు వారి వృత్తి, ఉద్యోగాలను కాదని తిరిగే అవకాశం ఉండదు. దానిని సాకుగా తీసుకుని బ్లాక్‌లో విక్రయాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనిని సామాన్యులు, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సేవా సంస్థల వారు తట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలి.
– పి.తులసి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి,
రాజమహేంద్రవరం
ఫ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్
ఫ గ్యాస్ కొరత వార్తలతో జనంలో అలజడి
ఫ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో గుబులు
ఫ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు
ఫ బ్లాక్‌లో మొదలైన విక్రయాలు!
ఫ వివిధ రంగాలపై ప్రభావం
హెల్ప్‌లైన్ నంబర్లు
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో సమస్యలు తలెత్తితే 80746 61259 నంబరులో సంప్రదించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి తెలిపారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు.
గ్యాస్ బుకింగ్ కోసం ప్రత్యామ్నాయ నంబర్లివీ..
కంపెనీ హాయ్ మెస్సేజ్ మిస్డ్ కాల్ నంబరు
(వాట్సాప్ నంబరు)
ఇండేన్ గ్యాస్ 758 888 8824 845 495 5555
భారత్ గ్యాస్ 180 022 4344 771 095 5555
హెచ్‌పీ గ్యాస్ 9222 201 122 949 360 2222
సోషల్ మీడియా ప్రచారంతో..
యుద్ధ పరిస్థితులు, చమురు, గ్యాస్ నిల్వలపై మీడియాలో వస్తున్న సమాచారాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటున్నారు. కొంత మంది గ్యాస్, చమురుకు కొరత వచ్చే పరిస్థితులు వచ్చేశాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి చూసిన వారు ఆందోళనకు గురై, వంట గ్యాస్ ముందస్తు నిల్వకు ప్రయత్నిస్తున్నారు. అవసరం లేకుండా గ్యాస్ బుక్ చేయడం వలన కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పైగా దీనివలన బ్లాక్‌లో విక్రయాలకు కూడా అవకాశాలు ఏర్పడతాయని అంటున్నారు. ఇప్పటికే మండపేట రూరల్‌లో సిలిండర్లను గ్యాస్ బుక్ చేసుకున్న వారికి కాకుండా వేరొకరికి బ్లాక్‌లో రూ.2 వేల నుంచి రూ.3,500కు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కట్టెల ధరలకు రెక్కలు
గ్యాస్ కొరత భయంతో కట్టెలకు డిమాండ్ పెరుగుతోంది. 25 కిలోల కట్టెల ధర గతంలో రూ.120 ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ.200కు పెరిగింది. గతంలో టన్ను కట్టెల ధర రూ.4,800 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.8 వేలు పలుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు.
వంటకు పుల్లలు సిద్ధం u
జిల్లాలో మండలాలు 22
జనాభా 18.32 లక్షలు
వంటగ్యాస్ సరఫరా ఏజెన్సీలు 52
వంటగ్యాస్ కనెక్షన్లు 8.67 లక్షలు
సంక్షామం తప్పదా!
వంట గ్యాస్ కొరత తీవ్రమైతే సంక్షేమంపై కూడా ప్రభావం పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు వంటివి ప్రభావితమవుతాయి. జిల్లాలో 33 సాంఘిక సంక్షేమ, 21 బీసీ సంక్షేమ, 10 గిరిజన సంక్షేమ హాస్టళ్లున్నాయి. ఈ 64 సంక్షేమ హాస్టళ్లలో సుమారు 5,790 మంది విద్యార్థులుంటున్నారు. గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తితే హాస్టళ్లలో ఉంటు న్న విద్యార్థులతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సైతం ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏజెన్సీల వారీగా శనివారం సిలిండర్ల బుకింగ్‌లు, డెలివరీల వివరాలు
ఏజెన్సీ బుకింగ్ డెలివరీ అందుబాటులో 72 గంటలుగా
ఉన్న సిలిండర్లు పెండింగ్
ఇండేన్ 3,355 2,100 7,232 1,544
హెచ్‌పీ 15,278 10,134 8,077 18,306
బీపీసీ 1,236 727 1,138 2,394
మొత్తం 19,869 12,961 16,447 22,244
పాలకుల పుణ్యమా అని ఇప్పటికే నిత్యావసరాల ధరలు ధనాధన్‌మంటూండటంతో సామాన్యులు ఇప్పటికే పెనం మీద పేలాల్లా వేగిపోతున్నారు. పొయ్యి మీదకే కాదు.. ఇప్పుడు పొయ్యి కింద మంటకు కూడా తంటా వచ్చింది. ఇరాన్‌తో ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధం పుణ్యమా అని నానాటికీ పెరుగుతున్న వంట గ్యాస్ సమస్య ప్రజల్లో సెగలు పుట్టిస్తోంది. గ్యాస్‌కు ఎటువంటి కొరతా లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. సిలిండర్ ఖాళీ అయితే మళ్లీ దొరుకుతుందో దొరకదోనని జనం ఆందోళన చెందుతున్నారు.


