విద్యార్థులకు సూచనలివీ..
● విద్యార్థులు విధిగా తమ వెంట హాల్ టికెట్ తీసుకు వెళ్లాలి.
● పరీక్షకు సంబంధించి పుస్తకాలు, పేపర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లరాదు.
● 24 పేజీల సమాధానాల బుక్‌లెట్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి.
● ప్రశ్న పద పరిమితిని పాటించాలి. జవాబుల నాణ్యతను బట్టి మార్కులిస్తారు.
● సైన్స్ పరీక్షలో ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి విడివిడిగా ఓఎంఆర్ షీట్లున్న రెండు 12 పేజీల బుక్‌లెట్లు ఒకేసారి అందిస్తారు. ఫిజికల్ సైన్స్ బుక్‌లెట్‌లో ఫిజికల్ సైన్స్ సమాధానాలు, నేచురల్ సైన్స్ బుక్‌లెట్‌లో ఆ సబ్జెక్టు సమాధానాలు మాత్రమే రాయాలి.
● ఎటువంటి అవకతవకలకు పాల్పడినా తదుపరి పరీక్షలకు అనుమతించరు. ముందు రాసిన పరీక్షల ఫలితాలు వెల్లడించరు.
● అభ్యర్థి పేరు, రోల్ నంబరు లేదా అభ్యర్థి ఇతర వివరాలను 24 పేజీల బుక్‌లెట్, మ్యాప్, గ్రాఫ్ షీట్‌లో ఏ పేజీలోను రాయకూడదు.
రాయవరం: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 391 కేంద్రాల్లో 72,797 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 36,661 మంది బాలురు, 36,136 మంది బాలికలు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 28,921, తూర్పు గోదావరి జిల్లాలో 24,566, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 19,310 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అన్ని చర్యలూ చేపట్టింది. శనివారం మధ్యాహ్నం అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశాలు నిర్వహించి, సూచనలు, సలహాలు అందజేశారు.
సీఎస్, డీఓలు ఏం చేయాలంటే..
ఫ చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ అధికారులు (డీఓ) ముందుగా పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, పరిశుభ్రత పరిశీలించాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఫామ్‌లూ సిద్ధం చేసుకోవాలి. ట్రంక్ పెట్టెలు, క్లాత్ బ్యాగ్స్ వంటి కంటింజెన్స్ సామగ్రి సిద్ధం చేసుకోవాలి.
ఫ సిబ్బంది నుంచి వారి కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేషన్స్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సిబ్బందికి గుర్తింపు కార్డులివ్వాలి.
ఫ బాలికలను తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి.
ఫ పరీక్ష జరుగుతున్న రోజుల్లో రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. నిర్దేశిత సమయం కంటే ముందు సీఎస్, డీఓలిద్దరి సంతకాలతో పరీక్ష పత్రాల కట్టల సీల్ తెరవాలి.
ఫ లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్లకు తరగతి గదులు కేటాయించాలి.
ఇన్విజిలేటర్ల విధులివీ..
ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి.
పరీక్ష పేపర్ల కోడ్‌లు, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి.
పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి. 8.45 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలోకి అనుమతించాలి. 9.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు.
ప్రతి విద్యార్థినీ సోదా చేసి, ఎటువంటి ఫర్‌బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకోవాలి.
విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్‌టికెట్ అందిస్తారు. విద్యార్థి హాల్ టికెట్‌ను అటెండెన్స్ షీట్‌లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి. అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి.
అన్ని పరీక్షలూ బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి.
ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలను విద్యార్థులకు వివరించాలి.
ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్ పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు.
ఓఎంఆర్ షీట్ ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దష్టికి తీసుకుని వెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి.
ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్ కోడ్‌పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి.
9.25 గంటల్లోగా ఇన్విజిలేటర్ అన్ని పనులూ ముగించుకుని 9.30 గంటలకు కచ్చితంగా ప్రశ్న పత్రాలివ్వాలి.
ప్రశ్న పత్రాలు తీసుకున్న వెంటనే సరిపడినన్ని ఉన్నాయా? ఆ రోజుకు సంబంధించిన సబ్జెక్టు/పేపర్‌కోడ్/మీడియం సరి చూసుకోవాలి. పేపరు ఏ మాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
ఫ గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్‌ను ఎర్ర సిరా పెన్‌తో క్యాన్సిల్ చేయాలి.
ఫ సమాధాన పత్రాలు, ఆన్సర్ బుక్‌లెట్ అన్నీ సరి చూసుకున్నాకే విద్యార్థులను బయటకు పంపించాలి.
ఒత్తిడి తేవద్దు
రాత్రి పూట ఎక్కువ సమయం చదవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు/సంరక్షకులు ఒత్తిడి చేయరాదు.
ఆందోళనను నివారించడానికి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు లేదా ముందుగానే చేరుకుంటే మంచిది.
అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కే లు తదితర స్టేషనరీని విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తప్పకుండా తీసుకు వెళ్లేలా చూసుకోవాలి.
పరీక్ష కేంద్రంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడరాదని, దుష్ప్రవర్తనలకు పాల్పడరాదని పిల్లలను హెచ్చరిస్తే మంచిది.
ఫ నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ఫ ఉమ్మడి జిల్లాలో హాజరు కానున్న 72,797 మంది
ఫ ఏర్పాట్లు పూర్తి


