ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Mar 16 2026 7:46 AM | Updated on Mar 16 2026 7:46 AM

దేవరపల్లి: అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారిద్దరూ అట్నుంచి అటే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈత సరదాయే వారి ప్రాణాలను బలి తీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి జలాశయంలో జరిగిన ఈ సంఘటన దేవరపల్లి మండలం యాదవోలులో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన 11 మంది యువకులు ఓ వ్యాన్‌లో ఆదివారం ఉదయం గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు. అమ్మవారి దర్శనానంతరం కొండ ప్రాంతంలో సరదాగా గడిపారు. అక్కడ వంటలు వండుకుని, విందు భోజనాల అనంతరం, మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గుబ్బల మంగమ్మ తల్లి జలాశయం వద్ద ఆగారు. వీరిలో వరుసకు అన్నదమ్ములైన తుమ్మల నాగరాజు (32), తుమ్మల రమణ (34) సరదాగా ఈత కొట్టడానికి జలాశయంలో దిగారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఒక్కసారిగా గల్లంతయ్యారు.

ఒడ్డున ఉన్న తోటి గ్రామస్తులు ప్రమాదాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని రాత్రి వేళ నాలుగు గంటలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, పలువురు గ్రామస్తులు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరారు. అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడు నాగరాజుకు వివాహం కావాల్సి ఉంది. మరో మృతుడు రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు వ్యవసాయ పనులు చేస్తూండగా, రమణ తాపీ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు.

గుబ్బల మంగమ్మ జలాశయంలో

ఇద్దరి మృతి

యాదవోలులో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement