చంద్రబాబు నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే కల్తీ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే కల్తీ ప్రచారం

Mar 13 2026 7:57 AM | Updated on Mar 13 2026 7:57 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు,

మాజీ మంత్రి చెల్లుబోయిన

రాజమహేంద్రవరం రూరల్‌: చంద్రబాబునాయుడు తన సొంత నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసి భక్తులను, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైకి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి దయ వల్ల ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. గతంలో కిలో నెయ్యి రూ.308కి సరఫరా చేస్తే ఇప్పుడు అదే క్వాలిటీ నెయ్యికి రూ.716 చెల్లిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలకల్తీ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ప్రస్తుతం పాలతో పాటు అన్ని వస్తువులలోను చంద్రబాబు ప్రభుత్వంలో కల్తీ జరుగుతోందన్నారు. తప్పుచేసిన వారిని తప్పించేవారు ఉండడంతో కల్తీని అరికట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

కమిటీలను త్వరితగతిన పూర్తిచేయండి

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ ఉదయం జిల్లా స్థాయి, మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులందరూ హాజరుకావాలని తెలిపారు. గ్రామాలలోను, డివిజన్‌లలోను పార్టీ కేడర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్‌, కడియం మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పులూరి వీరవెంకటసత్యనారాయణ, యాదల సతీష్‌చంద్ర స్టాలిన్‌ పాల్గొన్నారు.

ఎల్పీజీ గ్యాస్‌కు కొరత లేదు

– జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గ్యాస్‌ నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ప్రతి గ్యాస్‌ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్‌, నమోదైన బుకింగ్‌లు, గ్యాస్‌ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా కొంతమంది వినియోగదారులు అధికంగా గ్యాస్‌ బుకింగ్‌లు చేస్తున్నారని తెలిపారు. అయితే జిల్లాలో గ్యాస్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 212 మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ స్టాక్‌, 14,829 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో రోజువారీ సగటు వినియోగం సుమారు 11 వేల సిలిండర్లుగా ఉండగా, రీ ఫిల్లింగ్‌ యూనిట్ల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందన్నారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్‌ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్‌ ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను నమ్మవద్దని, జిల్లా అధికారిక మార్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలను కోరారు. గ్యాస్‌ బుకింగ్‌ లేదా సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తిన పక్షంలో 8074661259 హెల్ప్‌లైన్‌ నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా సివిల్‌ సప్లైస్‌ అధికారి వి. పార్వతి పాల్గొన్నారు.

రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ

అమలాపురం రూరల్‌: ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రుణం పొందిన వారు ఏప్రిల్‌ 30వ తేదీ లోపు చెల్లిస్తే 2025 డిసెంబర్‌ 31 వరకు ఉన్న వడ్డీని మాఫీ చేస్తామని కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 66 మంది వినియోగించుకుని రూ.24.55 లక్షల వడ్డీ మాఫీ పొందారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement