మొండి గోడు వినేదెవ్వరు! | - | Sakshi
Sakshi News home page

మొండి గోడు వినేదెవ్వరు!

Mar 11 2026 7:50 AM | Updated on Mar 11 2026 7:50 AM

మొండి గోడల మధ్య విద్యాబోధన

మూడు గదులు, ఎనిమిది తరగతులు

గోపవరం పాఠశాల దుస్థితి

ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి

దేవరపల్లి: పైకప్పు లేని పాఠశాల భవనం.. కేవలం మూడు తరగతి గదులు.. సుమారు 104 మంది విద్యార్థులకు బోధన.. నమ్మలేని ఈ నిజాన్ని చూడాలంటే గోపాలపురం మండలం గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలకు రావాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాలల దుస్థితికి ఇది నిదర్శనంగా నిలిచింది. మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ స్కూల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ విద్యాబోధన జరుగుతోంది.

ఏడాదిన్నరగా..

ఈ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు ఏడాదిన్నర క్రితం అధికారుల ఆదేశాల మేరకు పైకప్పులను తొలగించారు. తొలగించిన శిథిలాలు ఎక్కడక్కడ ఉండిపోవడంతో ఇటీవల పాఠశాల నిర్వహణ నిధుల నుంచి ఉపాధ్యాయులు తొలగించారు. భవనాల పైకప్పులు తొలగించిన, వాటి నిర్మాణం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. పాఠశాలలో రెండు భవనాలను దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇవి బీటలు తీసి, శ్లాబ్‌లు పెచ్చలూడి ప్రమాదకరంగా మారటంతో, వాటిని తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భవనాలను పూర్తిగా తొలగించకుండా పైకప్పులను మాత్రమే తీసివేశారు. ఆ మొండి గోడల మధ్య దాదాపు 16 నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎండలు పెరిగిపోవడంతో మొండి గోడలపై ప్లాస్టిక్‌ బరకాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు.

రెండే మరుగుదొడ్లు

ఈ పాఠశాలలో 104 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వీటినే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ వినియోగిస్తున్నారు. కనీసం నీటి వసతి లేకపోవడంతో అవి అధ్వానంగా మారాయి. బాలుర మరుగుదొడ్డి తలుపు శిథిలమై వేలాడుతోంది. గదులు లేక ఆరు బయట వరండాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. బల్లలు లేక విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులూ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వంట గది దుస్థితి

మధ్యాహ్న భోజనం పథకంలో వంటలు చేయడానికి నిర్మించిన వంటశాల శిథిలావస్థకు చేరుకుంది. వంటశాలకు ఉన్న తలుపు పాడైపోవడంతో ఎలుకలు సంచరిస్తున్నాయని, కూరగాయలు, నిత్యావసరాలను పాడుచేస్తున్నాయని వంట ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం చేపట్టిన వంట షెడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement