సామర్లకోట: పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పాడి గేదెలు సజీవ దహనమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఏలేరు కాలువ గట్టుపై పశువుల కోసం ఉండవిల్లి వెంకన్నబాబు పాక వేసుకున్నాడు. దానిలో రెండు పాలిచ్చే గేదెలు, మూడు చివిడి గేదెలను ఉంచాడు. అయితే మంగళవారం పాక మీదుగా వెళుతున్న విద్యుత్ తీగ తెగి పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల్లో ఐదు గేదెలూ కాలిపోయాయి. సమీపంలో వెంకన్నబాబుకు చెందిన గడ్డి మేటుతో పాటు మరో రెండు పాకలు కాలిబూడిద అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు ప్రమాద వివరాలను తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మికి సమాచారం ఇచ్చారు.
బైక్‌లు ఢీకొని ముగ్గురికి గాయాలు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు పాదాలమ్మ ఆలయం సమీపంలో మంగళవారం ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. చిట్ర లోవరాజు, జోష్ సత్య అప్పలరాజు బైక్‌పై ఏలేశ్వరం మండలం సిరిపురం వెళుతున్నారు. అలాగే ఏలేశ్వరం మండలం యర్రవరం నుంచి బైక్‌పై గుమ్ములూరి లచ్చబాబు ప్రత్తిపాడు వస్తున్నాడు. సరిగ్గా పాదాలమ్మ ఆలయం సమీపానికి వచ్చే సరికి ఎదురెదురుగా వీరు ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురికీ స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు హెల్త్ సెంటర్ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది.
చాగల్లులోమృతదేహం కలకలం!
చాగల్లు: చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ యార్డులోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పూడ్చివేశారనే వార్త మంగళవారం ఉదయం గ్రామంలో హల్‌చల్ చేసింది. గ్రామంలోని ఉపాధి కూలీలు పని కోసం యార్డు వైపు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోతులో మట్టి వేసి పూడ్చుతున్నట్లు కనిపించింది. దీంతో అక్కడ మృతదేహాన్ని పూడ్చారంటూ వార్త హల్‌చల్ చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై కె.నరేంద్ర తన సిబ్బందితో కలిసి యార్డు వద్దకు చేరుకుని గొయ్యి తవ్వించారు. అందులో చనిపోయిన కుక్క కళేబరం కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బంగారు
ఆభరణాల చోరీ
అయినవిల్లి: తొత్తరమూడి పెదపాలెంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. అయినవిల్లి ఎస్సై వై.జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. పెదపాలేనికి చెందిన కుడుపూడి శ్రీనివాసరావు ఈ నెల 7వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగి ఈ నెల 10న తన ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి వెనుక భాగంలో తలుపులు బద్ధులుకొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలకు వెళ్లిచూడగా గదిలోని బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో బంగారం చెవి దిద్దులు, ఒక అంజి ఉంగరం, నల్లపూసల లాకెట్, మూడు చిన్న రూపులు కలిపి సుమారు 16 గ్రాముల బంగారం, కొంత నగదు మాయమైనట్టు గుర్తించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


