కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీపాల ఘటనలో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. రోజురోజుకూ వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ ఘటనలో 21 మందికి 10 మంది మృత్యువాత పడగా, 11 మందికి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌కు సంబంధించిన వివరాల ప్రకారం కిమ్స్ బొల్లినేనిలో నలుగురికి వైద్య చికిత్సలు అందిస్తుండగా వారిలో ఇద్దరికి వెంటిలేటర్, ఇద్దరికి వెంటిలేటర్, డయాలసిస్ పక్రియ కొనసాగుతోంది. రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురూ వెంటిలేటర్, డయాలసిస్‌పై ఉన్నారు. డెల్టా ఆసుపత్రిలో ముగ్గురికి వెంటిలేటర్, డయాలసిస్ పక్రియ కొనసాగుతోంది. రవి చైతన్య కిడ్నీ కేర్‌లో ఒకరికి డయాలసిస్ జరుగుతోంది.
టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ
బస్సులో ఉచిత ప్రయాణం
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్‌ఎన్ మూర్తి శుక్రవారం తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. ఈ మేరకు సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
టెన్త్ పరీక్షలు సమర్థంగా
నిర్వహించాలి
రాజమహేంద్రవరం రూరల్: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆల్కాట్‌తోటలోని సత్య సాయి గురుకులంలో శుక్రవారం జిల్లాలోని ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంలు తదితర అధికారులతో సమీక్షించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆయా కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏడీ వెంకటరాజు, డీసీఈబీ కార్యదర్శి దేవా అనిత, కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బి.దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


