వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టొద్దు
ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల
నల్లజర్ల/జంగారెడ్డిగూడెం: ‘వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టవద్దని ముందే చెప్పాం. అయినా కూటమి నాయకులు, కార్యకర్తలు వినడం లేదు. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. ప్రజలు మీకిచ్చిన పదవీకాలంలో మరో రెండు సంక్రాంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జరిగేది మీరే చూస్తారు...’ అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఆర్.శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసుల వేధింపులకు గురైన యువకులను బుధవారం శ్యామల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ కుటుంబంలో ఇక్కడ కొందరు తమ్ముళ్లకు అన్యాయం జరిగిందని, ఒక అక్కగా వారిని కలవాలని వచ్చానని శ్యామల చెప్పారు. అనంతరం పడమర చోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు గొడ్డును బాదినట్లు బాదుకుంటూ రోడ్డుపై నడిపించడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ తమ పార్టీ శ్రేణుల మంచితనమే చూశారని, ఇక నుంచి రెచ్చిపోయే ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్తకు తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శ్యామల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కూడా వచ్చి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.


