ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు తమ 9 నెలల శిక్షణను చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సూచించారు. ఈ శిక్షణను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎటువంటి నెగెటివ్ ఆలో చనలూ లేకుండా శిక్షణ పూర్తి చేయాలని అన్నారు. దురలవాట్ల జోలికి పోవద్దని, సమాజంలో ఉన్న కష్టాలను తెలుసుకుని, మానవత్వంతో స్పందించి, సహా యం చేయాలని సూచించారు. నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపడంలో ఏపీఎస్పీ పాత్ర కీలకమన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో తన అనుభవాలను వివరించారు. పోలీసు శిక్షణ కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా, నైతికంగా బాధ్యతాయుతమైన సిబ్బందిని తయారు చేసే ప్రక్రియని చెప్పారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే పోలీస్ కానిస్టేబుల్‌గా అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ట్రైనింగ్ అడిషనల్ కమాండెంట్ వీవీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ టి.నాగ శ్రీనివాస్, ఆర్‌ఐలు కె.నరసింహరావు, జల్లు శ్రీనివాసరావు, బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కాశఋ విశ్వనాథం, డీటీసీ ఇన్‌స్పెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.


