రాజ్యలాభం కన్నా ధర్మలాభం గొప్పది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాజ్యలాభం కన్నా ధర్మమార్గం గొప్పది. ధర్మానికి తపస్సే మార్గమని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెబుతాడు’ అని సామవేదం షణ్ముఖశర్మ తెలిపారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారతం ప్రవచనాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ‘‘తీర్థయాత్రలు ముగించుకు వచ్చిన పాండవుల వద్దకు కృష్ణుడు వచ్చి ధర్మజ, భీములకు నమస్కరిస్తాడు. వారిద్దరూ వయసులో కృష్ణునికన్నా పెద్దలు. అర్జునుడిని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు. కృష్ణునికి నకుల సహదేవులు నమస్కరించారు. ధర్మరాజుతో కృష్ణుడు మాట్లాడుతూ, వనవాస సమయంలో నీలో ఎటువంటి సుగుణాలున్నాయో, రాజుగా ఉన్న సమయంలో కూడా అవే ఉన్నాయి. నీవు కర్మలను కామ్య దృష్టితో చేయవు’’ అని అంటాడని వివరించారు. సాధకుని దృష్టి ధర్మరాజుపై, లక్ష్యం కృష్ణునిపై ఉండాలని అన్నారు. ‘‘అనంతరం వారి వద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన తపస్సా్‌ాధ్యయ సంపన్నుడు. జరామరణాలు లేనివాడు. వేల సంవత్సరాల వయసున్నా, పాతికేళ్ల యువకునిలా ఉండేవాడని వ్యాసుడు వర్ణించాడు. ప్రళయ కాలంలో సృష్టి అంతా జలమయమైన సమయంలో కూడా ఆయన అదే శరీరంతో ఉన్నారు’’ అని చెప్పారు. శకుని ప్రోద్బలంతో కౌరవులు ఘోష యాత్రకు ప్రయాణమవుతారన్నారు.
గ్రంథావిష్కరణ
విశ్రాంత ఓఎన్‌జీసీ అధికారి, ప్రముఖ సాహితీవేత్త కవితా ప్రసాద్ రచించిన సౌందర్యలహరి పద్య సంపుటిని ప్రవచనానంతరం షణ్ముఖశర్మ ఆవిష్కరించారు. శంకరభగవత్పాదులు అందించిన సౌందర్యలహరి శ్లోకాలను మధ్యాక్కర ఛందస్సులో కవితా ప్రసాద్ అనువదించిన తీరు అభినందనీయమని అన్నారు. ఆదిశంకరుల శ్లోకాలకు రచయిత ప్రామాణికమైన అనువాదాన్ని అందించారని చెప్పారు.


