
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ కీర్తి తదితరులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో నల్లజర్ల, కోరుకొండ, సీతానగరం, తాళ్లపూడి, అనపర్తి, రాజానగరం మండలాల్లో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్మ, బొప్పాయి, కూరగాయల పంటల్లో ఈ నత్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. కానీ పంటల ఉత్పత్తి మీద ఇప్పటి వరకు ఈ నత్తల ప్రభావం ఏమి లేదన్నారు.
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నత్తల నిర్మూలనకు వివిధ పద్ధతులపై ప్రదర్శనలతో కూడిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నత్తలను చేతితో సేకరించి ఉప్పు ద్రావణంలో వేయడం, కాపర్ సల్ఫేట్, ఫెరరస్ సల్ఫేట్ ద్రావణాలను పిచికారీ చేయడం, మెటా డీఎన్ మందును పొలాల్లో వేయడం వంటి చర్యల ద్వారా సమర్థవంతంగా నిర్మూలించవచ్చని తెలిపారు. ఉప్పు ద్రావణంలో ముంచిన గన్ని బ్యాగులను పొలాల గట్లపై ఉంచితే, నత్తల వ్యాప్తి ఇతర పొలాలకు చేరకుండా అడ్డుకోవచ్చని వివరించారు.
జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి 1,32,101 ఎకరాల్లో ఈ పంట నమోదు పూర్తయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 6,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ విధానం ద్వారా పంటలను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,573 మంది రైతులు 4,246 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గేష్, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.