
రెండు షాపుల్లో చోరీలు
అమలాపురం టౌన్: పట్టణంలోని ఎర్ర వంతెన వద్ద, బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండు చోరీ ఘటనలతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఈదరపల్లి బైపాస్ రోడ్డులోని పవన్ మారుతీ కేర్ షాపు, స్థానిక ఎర్ర వంతెన సమీపంలోని కొల్లూరి బిల్డింగ్ మార్ట్‌లో ఉన్న ఎలక్ట్రికల్ షాపులో ఈ చోరీలు జరిగాయి. బైపాస్ రోడ్డులో కారులో వచ్చిన దొంగ.. షాపు షట్టర్లు పగులగొట్టి దోచుకున్నాడు. ఎర్ర వంతెన సమీపంలోని షాపు పైకప్పు పగులగొట్టి, లోనికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. మరికొంత మంది దొంగలు ఇదే షాపు షట్టర్లు పగులగొట్టి మరీ షాపులోకి ప్రవేశించారు. ఈ షాపులో రూ.వేలల్లో నగదు, పది వైరు కట్టలు, ఇతర మెటీరియల్‌ను దోచుకున్నారు. బైపాస్ రోడ్డులోని పవన్ మారుతీ కేర్‌లో కొంత నగదును దొంగ తస్కరించాడు. సంఘటన స్థలాల్లో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. షాపు యాజమాని జయిన గణేష్, ఎర్ర వంతెన సమీపంలోని షాపు యాజమాని కొల్లూరి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయా షాపుల్లో చెరో రూ.25 వేల సొత్తు దొంగిలించినట్టు చెప్పారు. ఒకే రాత్రి రెండు షాపుల్లో దొంగలు చొరబడ్డారంటే పట్టణంలోకి వేరే ప్రాంతానికి చెందిన దొంగల ముఠా వచ్చిందని వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.