
సామాజిక చైతన్యం కోసం కవుల పోరాటం
అమలాపురం టౌన్: దళిత కవి తేజాలైన కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్నలు తమ కలాలతో సామాజిక చైతన్యం కోసం పోరాడారని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. తెలుగు అసోసియేషన్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం భూపయ్య అగ్రహారంలోని కోనసీమ మహిళా మండలి భవనంలో దళిత తేజాల పేరిట ఆదివారం రాష్ట్ర స్థాయి సాహిత్య సదస్సు జరిగింది. దీనికి తెలుగు అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షురాలు కె.ఉషాజ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురి మహా కవులు రచించిన కావ్యాలు, కథలు, కవితలపై చర్చించారు. సామాజిక కవి కుసుమ ధర్మన్న సమానత్వం కోసం పోరాడితే, కవి గుర్రం జాషువా సామాజిక రుగ్మతలపై తన కలంతో ఎక్కుపెట్టారని డాక్టర్ ప్రతాప్ గుర్తు చేశారు. ఇక కవి బోయి భీమన్న సామాజిక చైతన్యం కోసం పోరాడారన్నారు. సదస్సు కన్వీనర్లుగా శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘ అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ వ్యవహరించారు. తొలుత కవులు ధర్మన్న, జాషువా, భీమన్న చిత్రపటాలకు కవులు, సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సదస్సుకు హాజరైన దాదాపు 60 మంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ సాహిత్య పత్రాలను సమర్పించారు. వారి సాహిత్యాలపై సదస్సు విశ్లేషణ చేసింది. హాజరైన కవులు, రచయితలు, సాహితీవేత్తలను సదస్సు నిర్వాహకులు సత్కరించారు. కవులు అరిగెల బలరామమూర్తి, రవిచంద్ర, సబ్బెళ్ల వెంకట మహాలక్ష్మి, ఎం.నాగభూషణం, కోరుకొండ జాన్, పొలమూరి వెంకట్, జె.రాంబాబు, ముక్కామల చక్రధర్, వైఆర్‌కే నాగేశ్వరరావు, బొలిశెట్టి అనసూయ, కడలి సత్యనారాయణ, బి.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
సాహితీ సదస్సులో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్
కత్తిమండ ప్రతాప్