
ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు
జగ్గంపేట: భారత ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు, సందేహాలు నెలకొనడం విచారకరమని జేవీవీ వ్యవస్థాపకుడు వెన్నపూస బ్రహ్మారెడ్డి అన్నారు. రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఒమ్మి రఘురామ్ అధ్యక్షతన జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థలలో జిల్లా స్థాయి ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఆయువు లాంటివని, కానీ ఎన్నికల కమిషన్ తీరు పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఎన్నికల ప్రక్రియపై, ఓటరు లిస్టులపై, ఎన్నికలలో పోలింగ్ శాతం, వాటి కౌంటింగ్ శాతాల్లో హెచ్చుతగ్గులు, ఈవీఎంల సంఖ్య, వస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించి సందేహాలను నివృత్తి చేయకపోవడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో 2024లో చట్టం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో సీనియర్ మంత్రిని చేర్చడంతో, వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని తెలిపారు. సభాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతోందని, దీనిపై ప్రతి పౌరుడూ స్పందించాలన్నారు. ఎన్నికల సంఘం తీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా సదస్సులు నిర్వహించి వార్తా కథనాలు – వాస్తవాలు అనే అంశంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతారపు ప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు లోక్‌నాఽథ్, సంస్థ ప్రధాన కార్యదర్శి సుందరపల్లి గోపాలకృష్ణ, ప్రసంగి ఆదినారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు పప్పు దుర్గాప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.