
ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ప్రపంచానికి మేలు
పెరవలి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందని బ్రెజిల్ బృంద నాయకుడు వాల్టర్ లింక్ అన్నారు. బ్రెజిల్, యుఏఈ, శ్రీలంకకు చెందిన 27 మంది నిపుణులతో కూడిన బృందం పెరవలి మండలం ముక్కామలలో శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు, రైతు సాధికారతపై బృంద సభ్యులు పరిశీలించారు. ప్రకృతి సాగు ఏవిధంగా గిట్టుబాటు అవుతుంది, ఆదాయం వంటి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ముక్కామలలో ప్రదర్శించిన 9 సూత్రాల చక్రాన్ని సందర్శించారు. జీవామృతం, కోడిగుడ్డు – నిమ్మరసం ద్రావణం తయారీ, వినియోగం, నిల్వ పద్ధతులపై అవగాహన పొందారు. సాగు విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరిలో కలుపు నివారణ పద్ధతులు, కూలీల ఖర్చు తగ్గింపు తదితర సమాచారం రైతుల నుంచి సేకరించారు. వేసవిలో వేసిన నవధాన్యాల వలన పంట భూములకు కలిగే ప్రయోజనం, తక్కువ నీటి వినియోగంతో సాగు గురించి అవగాహన చేసుకున్నారు. డ్రోన్ ద్వారా కషాయాల పిచికారీని, బ్రిక్స్ రీడింగ్ ద్వారా పంట ఆరోగ్యం కొలిచే విధానాన్ని వీక్షించారు. ఆయిల్‌పామ్, వక్క, అరటి సాగు నమూనాలు పరిశీలించి, మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై ప్రకృతి వ్యవసాయంలో వారి పాత్ర గురించి తెలుసుకుని అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీపీఎం షేక్ మహబూబ్ వలీ, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ, మోడల్ మండల్ టీమ్ లీడర్ బసవన్నగౌడ్, వ్యవసాయాధికారి మేరీ కిరణ్, ఏపీఎం బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.