
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు నమూనా చెక్ అందజేశారు. కంబాల చెరువు నుంచి సభా స్థలి వరకూ స్వయంగా ఆటో నడిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 11,915 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రూ.17.87 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి ఎవరికై నా ఆర్థిక సాయం అందకపోతే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని, సమస్య పరిష్కరించి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తదితరులు పాల్గొన్నారు.