
బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు
● పాటించకుంటే కఠిన చర్యలు
● అవసరమైతే క్రిమినల్ కేసులు
● తయారీదారులతో సమీక్షలో కలెక్టర్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బాణసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాల్లో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, అనుమతులిచ్చేందుకు మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. బాణసంచా తయారీదారుల సంఘాల ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న యూనిట్లను తనిఖీ చేసి, భద్రతా లోపాలుంటే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, ఆ తరువాత మాత్రమే అనుమతులివ్వాలని ఆదేశించారు. తయారీ కేంద్రాలు నివాస ప్రాంతాలకు దూరంలో ఉండాలన్నారు. బాణసంచా తయారీలో పాల్గొనే కార్మికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, దీనిపై కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. లైట్నింగ్ అరెస్టర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, పొడి ఇసుక, నీరు వంటి అగ్నిప్రమాద నివారణ పరికరాలు, సామగ్రిని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిల్వ కేంద్రాల్లో సరైన వెంటిలేషన్ ఉండాలని చెప్పారు.
విక్రయ లైసెన్సుల జారీలో జాగ్రత్తలు
దీపావళి బాణసంచా విక్రయ కేంద్రాలకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేయడంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కీర్తి ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి, రిటైల్ బాణసంచా దుకాణాలు సురక్షితంగా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి దుకాణం మధ్య తగినంత ఖాళీ ఉండేలా మార్గదర్శకాలు పాటించాలన్నారు. దీపావళి పండగ సందర్భంగా బాణసంచా అమ్మకాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే జరపాలన్నారు. దీపావళి రోజు సాయంత్రం 5 గంటలకల్లా అన్ని దుకాణాలనూ మూసివేయాలని స్పష్టం చేశారు. అధికారులు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలు నిర్వహించాలని రిటైల్ బాణసంచా దుకాణాల నిర్వాహకులతో చెప్పారు. దీపావళి అనంతరం మిగిలిన బాణసంచాను ఇంట్లో నిల్వ చేయకుండా పోలీస్, రెవెన్యూ బృందాలు తనిఖీలు చేయాలన్నారు. తయారీదారులు తయారు చేసిన, విక్రయించిన బాణసంచా వివరాలు, ఎవరికి విక్రయించారనే సమాచారాన్ని నిరంతరం ఒక రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. దీపావళి రోజున విక్రయ కేంద్రాల్లో అత్యవసర సేవలకు మెడికల్ టీములు, అగ్నిమాపక బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యార్థం భద్రతా సూచన బోర్డులు, అత్యవసర నంబర్లు ప్రదర్శించాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, అదనపు ఎస్పీ డి.మురళీకృష్ణ, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, ఆర్‌డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, డీఎస్పీలు దేవకుమార్, భవ్య కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్‌కింగ్, డీపీఓ వి.శాంతామణి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ బీఎస్‌ఎం వలీ తదితరులు పాల్గొన్నారు.