
జక్కంపూడి రామ్మోహనరావుకు ఘన నివాళి
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా పోరాట యోధుడు, మాజీ మంత్రి, తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు సెంటర్‌లో ఆయన విగ్రహానికి గురువారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక లోకం అభ్యున్నతి కోసం తన తండ్రి నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆయుధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన జక్కంపూడి రామ్మోహనరావు.. వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.