
కమిషనర్‌గా రాహుల్ మీనా
ఎట్టకేలకు పోస్టు భర్తీ
సాక్షి, రాజమహేంద్రవరం: కాకినాడ జిల్లా జా యింట్ కలెక్టర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మీనా 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన నియామకంతో కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న నగర పాలక సంస్థ కమిషనర్ స్థానం భర్తీ అయింది.
మితిమీరుతున్న రాజకీయ జోక్యం
రాజమహేంద్రవరం సిటీ, రూరల్ టీడీపీ నేతల మితిమీరిన రాజకీయ జోక్యానికి ఇప్పటికే ఓ కమిషనర్ బలయ్యారు. బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే తాను ఇక్కడ పని చేయలేనంటూ గత కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దీనినిబట్టి ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ఏడాది పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కేతన్ గార్గ్ నగరాన్ని సుందరంగా, ఆక్రమణలు లేకుండా తీర్చిదిద్దాలని భావించారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించడంలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ప్రజాప్రతినిధి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు విమర్శలున్నాయి. ఏదైనా అక్రమ నిర్మాణం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లిన సందర్భంలో వెంటనే ఆ అధికారులకు ఓ ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ వచ్చేది. అది తమ వారిదేనని, దాని జోలికి వెళ్లవద్దంటూ హుకుం జారీ చేసేవారు. చేసేది లేక వెనుదిరగాల్సి వచ్చేది. ప్రధాన రోడ్లలో ఆక్రమణల తొలగింపులో కూడా కేతన్ గార్గ్ అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రతి పనినీ స్వయంగా పరిశీలించి, నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించే వారు. తను సంతృప్తి చెందితేనే బిల్లులు మంజూరు చేసేవారు. దీంతో ఎలాగైనా ఆయనను బదిలీ చేయించేందుకు కూటమి నేతలు కంకణం కట్టుకున్నారు. ప్రజాప్రతినిధుల వద్ద పైరవీలకు తెర తీశారు. దీంతో విసుగెత్తిపోయిన కేతన్ గార్గ్ ఇక్కడ ప్రశాంతంగా పని చేయలేనని భావించి బదిలీ కోసం స్వయంగా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయనను ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నం నగర పాలక సంస్థకు బది లీ చేసింది. తాజాగా వస్తున్న కమిషనర్ రాహుల్ మీనానైనా కూటమి నేతలు సక్రమంగా పని చేసుకునే అవకాశం కల్పిస్తారా.. 2027 పుష్కరాల వరకూ అయినా విధులు నిర్వహించే వీలు కల్పిస్తారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు
సర్వం సిద్ధం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల 18 వరకూ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని, రాజగోపురంతో సహా ఉపాలయాలను, పరిసరాలను, ఆ ప్రాంగణాన్ని, రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారు వివిధ అలంకరణలతో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. తొలి రోజు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, సాయంత్రం వాస్తు హోమం, ధ్వజ పతాక హోమాలు నిర్వహించనున్నారు. రాత్రి స్వామి వారిని పరావాసుదేవ అలంకరణలో శేషవాహనంపై ఊరేగించనున్నారు.