
6 నుంచి విద్యుత్ ఉద్యోగుల రెండో విడత ఆందోళన
రాజమహేంద్రవరం రూరల్: సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 6 నుంచి రెండో విడత ఆందోళనలు నిర్వహించనున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా బొమ్మూరులోని ఏపీ ట్రాన్స్‌కో సర్కిల్ ఎస్‌ఈ (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) ఎ.రమేష్‌కు శుక్రవారం నిరవధిక సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జగతా అచ్యుత రామయ్య మాట్లాడుతూ, గత నెల 15 నుంచి 22వ తేదీ వరకూ దశల వారీ ఆందోళనలు చేసినప్పటికీ విద్యుత్ సంస్థల యాజ మాన్యం పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 6న విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద, 8న ఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ వద్ద ధర్నాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 13న చలో విజయవాడ, 14న వర్క్ టు రూల్, 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు.
వైఎస్సార్ సీపీలో
పలువురికి పదవులు
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని అధిష్టానం పలు హోదాల్లో నియమించింది. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, మేడా గురుదత్తప్రసాద్‌లను నియమించారు.
ఆన్‌లైన్‌లో ఎన్‌ఎంఎంఎస్
పరీక్ష దరఖాస్తులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే డిసెంబర్ 7న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చన్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకూ పొడిగించారన్నారు. పరీక్ష రుసుం 16వ తేదీలోగా చెల్లించాలన్నారు. ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజినల్ ఎస్‌బీఐ కలెక్ట్ రశీదును తమ కార్యాలయంలో 18వ తేదీలోగా సమర్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, 7వ తరగతిలో 55 శాతం మార్కులు, కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షల్లోపు ఉన్న విద్యార్థులందరూ ఈ పరీక్షకు అర్హులని వివరించారు. పరీక్ష రాసే సమయానికి అన్ని ధ్రువపత్రాలూ సిద్ధం చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలని వాసుదేవరావు పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో కొప్పవరం
పంచాయతీ ప్రథమం
అనపర్తి: జాతీయ స్థాయిలో కొప్పవరం పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచిందని సర్పంచ్ కర్రి బులిమోహనరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా సర్పంచులు తమ అభిప్రాయాలు పంచుకోవడానికి భారతీయ నాణ్యతా మండలి (బీఐఎస్) సర్పంచ్ సంవాద్ పేరిట ఒక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది. ఈ యాప్‌లో ప్రతి నెలా ఏదో ఒక అంశం నిర్దేశించి, ఆయా గ్రామాల్లో సర్పంచులు సాధించిన పురోగతిపై వీడియో రూపంలో పోటీలు నిర్వహిస్తోంది. గత నెలకు సంబంధించి గ్రామ పంచాయతీల సొంత ఆర్థిక వనరులు (ఓఎస్‌ఆర్) అనే అంశంపై ఈ పోటీ నిర్వహించింది. గ్రామ పంచాయతీ పరిధిలో కొప్పవరం నుంచి లక్ష్మీనరసాపురం రోడ్డు మార్జిన్‌లో ఉపాధి హామీ పథకం ద్వారా 2021లో కొబ్బరి మొక్కలు నాటి ఆదాయం సమకూర్చుకోవడానికి చేసిన కృషిని ఈ పోటీలో వీడియో రూపంలో వివరించామని సర్పంచ్ బులిమోహనరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 75 వేల మంది సర్పంచులు ఈ పోటీలో పాల్గొనగా కొప్పవరం ప్రథమ స్థానం సాధించింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన సర్పంచ్‌లు ఎంపికయ్యారని బులిమోహన్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకు సంస్థ ప్రశంసాపత్రం పంపించిందని చెప్పారు.

6 నుంచి విద్యుత్ ఉద్యోగుల రెండో విడత ఆందోళన