
వైరల్.. హడల్
సాక్షి, రాజమహేంద్రవరం: వైరల్ జ్వరాలతో ప్రజలు హడలి పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా విజృంభిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా, ఎవరి గడప తొక్కినా జ్వర పీడితులు దర్శనమిస్తున్నారు. టైఫాయిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అత్యధికంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు దర్శనమిస్తున్నాయి. ప్లేట్‌లెట్లు పడిపోతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. తీవ్ర స్థాయిలో విష జ్వరాలు ప్రబలుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. డెంగీ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్వహిస్తే మాత్రమే కచ్చితమైన ఫలితం అందుతుందని, ప్రైవేటుగా నిర్వహించే పరీక్షల్లో నిర్ధారణ అవుతున్న కేసుల్లో పారదర్శకత ఉండదని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి
సీజనల్ జ్వరాల బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జిల్లా పరిధిలో 52 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 368 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 31 పీహెచ్‌సీలు, 1 సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జ్వరంతో బాధపడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ రెట్టింపవుతోంది. ప్రతి రోజూ 800 వందలకు పైగా ఓపీ నమోదవుతుంటే అందులో సింహభాగం జ్వరాల కేసులే ఉంటున్నాయి.
వైద్య పరీక్షల పేరుతో..
నిడదవోలు, గోపాలపురం, సీతానగరం, కొంతమూరు, శాటిలైట్ సిటీ, కడియం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా బాధితులు వస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇవి కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను వైద్యం కోసం ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా జ్వరం బారిన పడిన వారే కనిపిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వైద్యులు అందిన కాడికి దోచుకుంటున్నారు. వైద్య పరీక్షల పేరుతో పేదల రక్తాన్ని సైతం పిండేస్తున్నారు. గోకవరం, సీతానగరం ప్రాంతాల నుంచి మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జ్వర పీడితుల్లో అత్యధిక శాతం చిన్నారులే ఉంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలే ఉండడం బాధాకరం. ఉన్నట్లుండి ఒళ్లు వేడెక్కడం, నీరసం రావడంతో ఇబ్బంది పడుతున్నారు.
పంచాయతీలకు నిధుల కొరత
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధిక శాతం గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితమవుతోంది. కాలం చెల్లిన పైపులైన్లనే ఇప్పటికీ వినియోగించడం, అవి కూడా పలు ప్రాంతాల్లో డ్రైనేజీల్లో ఉండటం నీటి కాలుష్యానికి కారణమవుతోంది. ఇప్పటికీ అనేక పల్లెల్లో బోర్లు, బావుల నీటినే తాగడానికి వినియోగిస్తున్నారు. ఆ నీటిని నేరుగా తాగడం వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
నివారణ చర్యలేవి?
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల్లో బావులు, బోర్లు, కుంటలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూలనకు గంబూషియా చేపలను వదలాల్సి ఉన్నా ఎక్కడా అటువంటి దాఖలాలు లేవు.
ప్రైవేటులో దోపిడీ
జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు లేవు. ఈ వ్యాధిని ఎలీసా టెస్టు ద్వారానే గుర్తిస్తారు. మెడికల్ కళాశాల, జీజీహెచ్‌లో మాత్రమే ఈ ఎలీసా పరీక్షలు నిర్వహించేందుకు వీలుంది. కానీ ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రులు కిట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి డెంగీ అని చెప్పి రోగుల నుంచి రూ.వేలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే వైద్యశాఖకు సమాచారం ఇవ్వాలి. వారు ఆ బాధితుడికి ఎలిసా పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేస్తారు. కానీ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఏ ఆస్పత్రిలో చూసినా డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారని ప్లేట్‌లెట్లు తగ్గాయని చెబుతూ ఫీజులు దండుకుంటున్నారు.
విజృంభిస్తున్న విష జ్వరాలు
రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు
బాధితుల్లో చిన్నారులే అధికం
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
ప్రస్తుత సీజన్‌లో అత్యధిక శాతం చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు నీరసంగా, జ్వరం తగ్గినప్పుడు ఉత్సాహంగా ఉంటే వైరస్ ఫీవర్ అని గుర్తించి వైద్యులను సంప్రదించాలి. జ్వరం ఉంటే తక్షణ వైద్యంగా పారాసెట్‌మల్ టాబ్లెట్ మాత్రమే వాడాలి. యాంటీ బయోటిక్స్ జోలికి వెళ్లవద్దు. ద్రవ పదార్థాలు ఆహారంగా ఇవ్వాలి. కాచి చల్లార్చిన నీటినే తాగించాలి. పతి సంవత్సరం ఫ్లూ టీకాలు వేయించాలి.
– డాక్టర్ శివరామకృష్ణ, చిన్నపిల్లల వైద్య నిపుణులు
మలేరియా కేసులే అధికం
వాతావరణ మార్పులతో జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జీజీహెచ్‌కు గోకవరం నుంచి జ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారు. జ్వరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ పీవీవీ సత్యనారాయణ, జీజీహెచ్, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ

వైరల్.. హడల్

వైరల్.. హడల్