
దారికి రాని దోపిడీ కేసు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కలకలం రేపిన దారి దోపిడీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రాజమహేంద్రవరం నల్లమందు సందుకు చెందిన సమీర్ ప్రజాపత్ భవాని సిల్వర్ ప్యాలెస్ అనే వెండి బంగారు నగల వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. రోజూ ఇతర ప్రాంతాల్లో ఉన్న వెండి, బంగారు వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులు తయారు చేసి తీసుకెళ్లి ఇవ్వడం, తిరిగి వారి నుంచి ఆర్డర్లు తీసుకుని వారు ఇచ్చే నగదుతో పాటు వెండి, బంగారాన్ని తీసుకు వెళుతుంటాడు. గత నెల 28న మధ్యాహ్నం 12 గంటలకు యథావిధిగా అతని యజమాని చెప్పిన ఆర్డర్ల ప్రకారం వెండి వస్తువులను తీసుకుని, వాటిని డెలివరీ కోసం రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులో వస్తువులు ఇచ్చి సంబంధిత షాపుల నుంచి ముడి వెండిని, వెండి వస్తువులను, బంగారాన్ని తీసుకుని, గొల్లప్రోలులో పని ముగించుకుని చెందుర్తిలోని మరో బంగారు షాపు వద్దకు బయలు దేరాడు. మార్గ మధ్యంలో జాతీయ రహదారి 216 నుంచి చెందుర్తి గ్రామం వెళ్లే రోడ్డులో పామాయిల్ తోట వద్దకు వెళ్లేసరికి రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వచ్చి భవానిని అటకాయించి, అతని వద్ద ఉన్న 12.50 కిలోల వెండి, 51 గ్రాముల బంగారం, రూ.60 వేలను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విషయం తెలపడంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణలు తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.
ముందుగా రెక్కీ చేసి..
ప్రతి నెలా ఏదొక సమయంలో భవాని ఇక్కడకు వస్తుంటాడన్న విషయం తెలుసుకున్న అగంతకులు అసలు బాధితుడు ఎప్పుడు వస్తున్నాడు.. ఎలా వెళుతున్నాడనే విషయాలపై రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో ఇటువంటి దోపిడీలకు పాల్పడే కేసుల్లో ఉన్న నిందితుల వివరాలు సేకరించి వారి ద్వారా కేసును ఛేదించే పనిలో ఉన్నట్లు సమాచారం. నిందితుల వివరాలు, వారు ఉపయోగించిన మోటారు సైకిళ్ల ఆనవాళ్లు, వారు ఎటు వెళ్లారనే విషయాలు గాని తెలిక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది.
వ్యాపారిని కొట్టి
సొత్తు దోచుకున్న అగంతకులు
పోలీసులకు సవాల్‌గా మారిన కేసు
ఆధారాల కోసం ముమ్మర దర్యాప్తు
కానరాని ఆచూకీ..
రెండు మోటారు సైకిళ్లపై నలుగురు వ్యక్తులు వచ్చి తనను అటకాయించి దాడి చేసి, తన వద్ద ఉన్న వెండి బంగారు వస్తువులతో పాటు నగదును లాక్కెళ్లినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో నలుగురు అగంతకులు చెందుర్తి రోడ్డుకు ఏపక్క నుంచి వచ్చారు.. ఏ మోటారు సైకిళ్లు ఉపయోగించారనే దానిపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సమయం రాత్రి కావడంతో సీసీ కెమెరాల్లో అటువంటి ఆనవాళ్లు ఉన్న వ్యక్తులు ఎవరూ కనిపించకపోవడంతో ఇతర ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. చెందుర్తి రోడ్డుకు గొల్లప్రోలు– కత్తిపూడి 216 జాతీయ రహదారి నుంచి దారి ఉండగా అటువైపు 16వ జాతీయ రహదారి ఉంది. అగంతకులు ఎటు నుంచి వచ్చారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అసలు వారు ఏ మోటారు సైకిళ్లు ఉపయోగించారనే విషయం బాధితుడు చెప్పలేక పోతుండగా సీసీ కెమెరాల్లో దొరకకపోవడంతో పోలీసులు ఆధారాల కోసం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ రోడ్డుకు రావడానికి తాటిపర్తి వన్నెపూడి రోడ్డు నుంచి కూడా మరో మార్గం ఉండడంతో అగంతకులు ఎవరికీ అనుమానం రాకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ఆ రోడ్డు ద్వారా వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీ రాత్రి సమయంలో జరగడంతో అగంతకుల పోలికలను కూడా బాధితుడు చెప్పలేకపోవడం కేసు దర్యాప్తునకు ఆటంకంగా మారిందంటున్నారు.