
కొత్త జీఓల వెనుక రాజకీయ కుట్ర
జగ్గంపేట: పాఠశాలల్లోకి మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించరాదని, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివారం జగ్గంపేటలో పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడితి సతీష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులతో పాఠశాలల్లో విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారన్నారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు బయటకు రాకుండా చేయడానికి పన్నిన కుట్ర ఈ కొత్త జీఓ అని అన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని అన్నారు. పాఠశాలలను రాజకీయాలకు తావులేకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని, అయితే తల్లికి వందనం పథకం సందర్భంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో రాజకీయ నాయకులు పబ్లిసిటీ చేశారన్నారు. అలాగే వైజాగ్‌లో జరిగిన జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులను బస్సులలో తీసుకెళ్లి కనీస వసతులు కల్పించలేదని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఈఓలు గురించి ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పుడు, పరిష్కరించక పోగా విద్యార్థి సంఘాలను కట్టడి చేసే జీఓలు తీసుకురావడం సరికాదని అన్నారు. ఈ జీఓలను తక్షణం రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.