
ఫ్రెండ్‌షిప్ డే రోజున విషాదం
తాళ్లరేవు: స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు మరో స్నేహితుడితో కలసి బైక్‌పై వెళుతున్న యువకుడు ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలైన ఘటన ఆదివారం కోరంగిలో చోటు చేసుకుంది. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కొప్పాడి తాతాజీవర్మ (19) అలియాస్ తాతీలు అతని స్నేహితుడు అరదాడి శ్రీనివాస్‌తో కలసి కాకినాడ వెళ్లేందుకు బైక్‌పై బయలు దేరారు. జాతీయ రహదారి 216లోని కోరంగి దుర్గామల్లేశ్వర ఆలయం సమీపంలో అకస్మాత్తుగా గేదె అడ్డురావడంతో బలంగా గేదెను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తాతాజీ వర్మ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో యువకుడు శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. తాతాజీవర్మ హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడని, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని గ్రామస్తులు అన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
స్నేహితుడితో కలసి వెళుతుండగా ఘటన

ఫ్రెండ్‌షిప్ డే రోజున విషాదం