
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: స్థానిక సంజీవయ్యనగర్ బుక్కాపేటలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నలుబోను వెంకటేశ్వరరావు అనారోగ్యం కారణంగా గత నెల 15న మంగళగిరిలోని ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి నిడదవోలుకు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే వెంకటేశ్వరరావు భార్యకు బ్రెయిన్‌స్టోక్ రావడంతో ఇద్దరూ అక్కడే చికిత్స పొందుతున్నారు. కుమార్తె గౌతమి తల్లిదండ్రులను చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. మంగళగిరి నుంచి గౌతమి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు బద్దలకొట్టి తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గదిలో బీరువా లాకర్‌ను గునపంతో పెకించారు. లాకర్‌లో ఉన్న 30 కాసుల బంగారం, 20 కాసుల వెండి, రూ.50 వేలను దొంగలు అపహరించుకుపోయారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, సీపీఎస్ క్రైం సీఐ శ్రీధర్‌కుమార్ సంఘటనా స్థలానికి వివరాలు సేకరించారు. గౌతమి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.