
చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం
రూ.16 లక్షల ఆస్తి నష్టం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక శ్యామలా సెంటర్ వద్ద చెప్పుల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేడియం రోడ్డు నుంచి కోటిపల్లి బస్టాండ్‌కు మలుపు తిరిగే ప్రాంతంలో ఆనుకుని ఫ్యాక్టరీ ఫుట్‌వేర్ సేల్ అనే పేరుతో హైదరాబాద్‌కు చెందిన షేక్ మొహియుద్దీన్, ఆర్‌ఎస్ దత్తు ఈ చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఉదయం 6.40 గంటలకు ఆ దుకాణంలోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేశారు. ప్రమాదానికి దగ్గరలోనే అగ్నిమాపక కార్యాలయం ఉండడంతో వెంటనే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నగరంలోని ఆర్యాపురం, ఇన్నీసుపేట అగ్నిమాపక యంత్రాలతో పాటు కొవ్వూరు నుంచి మరో వాహనాన్ని రప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణానికి ఆనుకుని ఉన్న బాలాజీ అక్వేరియం, పెట్స్ దుకాణం అగ్ని ప్రమాదానికి గురైంది. సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అంచనా వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి సీహెచ్ మార్టిన్‌రూథర్ కింగ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మంటలను చాకచక్యంగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు.

చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం