
మెరుగుపడిన ఆగమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం
పరామర్శించిన దేవదాయశాఖ కమిషనర్, ఆలయ చైర్మన్
అన్నవరం: తీవ్ర ఆస్వస్థతకు గురై తుని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నవరం దేవస్థానంలోని ఎనిమిది మంది సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ విద్యార్దులు గురువారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. తీవ్ర జ్వరంతో బాధడుతున్న మరో ముగ్గురు విద్యార్థులను శుక్రవారం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి కూడా చికిత్స అందించడంతో వారు కోలుకున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, త్వరలోనే 11 మంది విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని తుని ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ స్వప్న తెలిపారు.
విద్యార్థులను పరామర్శించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్
చికిత్స పొందుతున్న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులను దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా విద్యార్దుల ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు కారణమేంటని ఆయన అధికారులను ప్రశ్నించగా గత నాలుగు రోజులుగా కొండదిగువన ఆరెంపూడి సత్రంలో దత్తపీఠం ఆధ్వర్యంలో జరిగిన యాగంలో విద్యార్థులు పాల్గొన్నారని మంగళవారం వరకు అక్కడే భోజనాలు చేశారని తెలిపారు. బుధవారం ఉదయం వీరు ఆగమ పాఠశాలలో భోజనాలు చేశారని తెలిపారు. ఆ మధ్యాహ్నం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడడంతో స్థానిక దేవస్థానం ఆసుపత్రిలో వైద్యం అందించామని తెలిపారు. గురువారం పరిస్థితి విషమించడంతో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అనంతరం ఆయన అన్నవరం దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలను కూడా పరిశీలించారు. ఆయన వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఆర్‌జేసీ వి.త్రినాథరావు ఉన్నారు.