
నాప్తాల్ ట్యాంకర్ బోల్తా
● తప్పిన పెను ప్రమాదం
● భారీ క్రేన్లతో ట్యాంకరును బయటకు తీసిన వైనం
ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక ఓఎన్‌జీసీ రిఫైనరీ నుంచి చైన్నె వెళుతున్న నాప్తాల్ ట్యాంకర్ గురవారం అర్ధరాతి గోతిలో బోల్తా పడింది. ఓఎన్‌జీసీ, ఫైర్ సిబ్బంది ట్యాంకర్‌ను సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి దొమ్మెటివారిపాలెంలో 216 జాతీయ రహదారి పక్కన ఈ ట్యాంకర్ అదుపు తప్పి గోతిలో పడిపోయింది. పేలుడు స్వభావం ఉన్న 29వేల లీటర్ల నాప్తాల్ ఉన్న ఈ ట్యాంకర్ బోల్తా పడటంతో అధికారులు అప్రమత్తయయ్యారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి 100 మీటర్ల పరిధిలో ఉన్న గ్రామస్తులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓఎన్‌జీసీ అధికారులతో సంప్రదిస్తూ ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయం ఓఎన్‌జీసీ సెక్యూరిటీ అఫీసర్ బలరామ్ ఆధ్వర్యంలో పోలీసు, ఫైర్ సిబ్బంది రిస్క్యూ ఆపరేషన్ చేశారు. ఎటువంటి పేలుడు సంభవించకుండా ఫోమ్ ఉపయోగించారు. రెండు అంబులెన్స్‌లు, నాలుగు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచి నాలుగు క్రేన్‌లు, ఒక భారీ క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్‌కు మరమ్మతులు చేసి చైన్నె పంపించారు.