
వినియోగదారుల అంగీకారంతోనే స్మార్ట్ మీటర్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విద్యుత్ వినియోగదారుల అంగీకారం ఉంటేనే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకూ 44,646 కమర్షియల్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చామని తెలిపారు. ఎక్కడా వినియోగదారుల నుంచి నిరసనలు రాలేదన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం వివరాలు తెలుసుకోవచ్చని, పలు ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బిల్లు స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించవచ్చన్నారు. జాప్యం జరిగినా చెల్లించిన వెంటనే సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్నారు. వినియోగ గణాంకాలను బట్టి గ్రిడ్‌ను మెరుగ్గా నిర్వహించవచ్చని చెప్పారు. స్మార్ట్ మీటర్లతో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద లోడ్ వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికతను అంగీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఎటువంటి అపోహలూ పెట్టుకోకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రీపెయిడ్ మీటర్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తిలక్ అన్నారు. సమావేశంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, ఎ.రాజశేఖర్, ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి డీసెట్
రెండో విడత కౌన్సెలింగ్
రాజమహేంద్రవరం రూరల్: డీసెట్–2025 రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 3న ప్రారంభమవుతుందని బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆర్‌జేడీ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆ రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని, ఈ నెల 5న సీటు ఎలాట్ చేస్తామని వివరించారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని డీఈఎల్‌ఈడీ కళాశాలలకు కేటాయించిన వారందరూ బొమ్మూరులోని డైట్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకుని, తుది అడ్మిషన్ లెటర్ పొందాలని సూచించారు.