
ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ను ఓదార్చుతున్నమంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ
అమలాపురం టౌన్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు మంగళవారం ఉదయం అమలాపురంలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇంటికి చేరుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లో గత నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిన్నాన్న, టింబర్ వ్యాపారి పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య, కుమార్తె, ఇద్దరు మనవళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతదేహాలు ఇంటికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ బోరున విలపించారు. చిన్నాన్నా... మమ్మల్ని అందరినీ విడిచి నీ కుటుంబాన్ని నీవెంట తీసుకుని వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయనను ఓదార్చారు.
ప్రముఖుల నివాళి
అమెరికా నుంచి విమానంలో సోమవారం రాత్రికి హైదరాబాద్ విమానాశ్రయానికి ఐదు మృతదేహాలను తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్సుల్లో అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటికి మంగళవారం ఉదయానికి చేరుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో వీరితో పాటు మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న బర్రి రీసెల్డ్ మృతదేహం వచ్చింది. దానిని రావులపాలెం నుంచి విశాఖపట్నానికి తరలించారు. నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన మృతదేహాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటి ఆవరణలో రెండు గంటల పాటు ఉంచారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను ఓదార్చారు.
కోటిలింగాలరేవులో అంత్యక్రియలు
ఐదు మృతదేహాలను మూడు ప్రత్యేక వాహనాల్లో ఉంచి అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వరకూ ఊరేగింపుగా అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే సతీష్‌కుమార్, మంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు పాల్గొన్నారు. అమలాపురం నుంచి ఊరేగింపుగా రాజమహేంద్రవరంలోని కోటిలింగాలరేవు వరకూ దాదాపు 70 కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర సాగింది. అనంతరం రేవులో అంత్యక్రియలు నిర్వహించారు. నాగేశ్వరరావు మనవడి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.
