
ఆనందంగా ఉన్నారు..
ఫ పొగాకు నారుకు మంచి రేటు
ఫ ఆశాజనకంగా మడులు
ఫ ముందుముందు ధర పెరుగుతుందని ఆశ
దేవరపల్లి: పొగాకు నారుమడులు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో పాటు నారుకు మంచి రేటు పలుకుతూండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025–26 పంట కాలానికి పొగాకు నాట్లు ప్రారంభం కావడంతో నారు తీతలు మొదలయ్యాయి. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌లోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 90 వేల ఎకరాల్లో పొగాకు సాగు జరుగుతుంది. దీనికి అవసరమైన పొగాకు నారును దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు మండలాల్లో మడులు కట్టి పెంచారు. ఆరోగ్యంగా ఉండటంతో నారుకు డిమాండ్ ఏర్పడింది. ఎగువ ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్) ప్రాంతమైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 20 రోజులుగా, లోయర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతమైన దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో 10 రోజులుగా మెరక పొలాల్లో ముమ్మరంగా నాట్లు పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తూండటంతో నాట్లు వేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. దుక్కులు సిద్ధం చేసి అనుకూల వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. ఏటా సాధారణంగా అక్టోబర్ 15 నుంచి నాట్లు ప్రారంభించి డిసెంబరు 15 నాటికి 90 శాతం పూర్తి చేస్తారు. అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో దసరాకు నాట్లు ప్రారంభిస్తారు.
125 హెక్టార్లలో..
రీజియన్ పరిధిలో ఈ ఏడాది సుమారు 125 హెక్టార్లలో నారుమడులు వేశారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, లక్ష్మీపురం, బందపురం, దుద్దుకూరు; కొవ్వూరు మండలం ఐ.పంగిడి, కాపవరం, దొమ్మేరు, ధర్మవరం, మలకపల్లి ప్రాంతాల్లో పొగాకు నర్సరీలు ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాలతో పాటు ఒంగోలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రైతులు ఈ ప్రాంతానికి వచ్చి నారు కొనుగోలు చేసి తీసుకు వెళతారు. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ ప్రాంతం రైతులతో కళకళలాడుతూంటుంది. అధిక దిగుబడులు ఇచ్చే 1353, ఎల్‌వీ–7 రకాల వంగడాలతో ఇక్కడి రైతులు నర్సరీలు వేశారు.
ఎకరం రూ.80 వేలు
పొగాకు నర్సరీలు వేసే భూముల కౌలు ఎకరానికి రూ.80 వేలు పలుకుతోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 15 వరకూ కౌలు వర్తిస్తుంది. అనంతరం భూమిని ఖాళీ చేసి యజమానికి అప్పగించాలి. గత ఏడాది ఎకరా కౌలు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పలికింది. ఇప్పుడు మరింత పెరిగిందని కౌలుదారులు వాపోతున్నారు. సుమారు 250 మంది కౌలుదారులు ఏటా నర్సరీలు వేసి, మంచి ఆదాయం పొందుతున్నారు. మూడేళ్లుగా మార్కెట్లో పొగాకుకు అత్యధిక ధర పలుకుతూండటంతో నారుకు కూడా డిమాండ్ ఏర్పడింది.
ఎకరం నారుకు రూ.5 వేలు
ఎకరం విస్తీర్ణంలో నాటడానికి 6 వేల మొక్కలు అవసరమవుతాయి. వీటి ధర ప్రస్తుతం రూ.5 వేలు పలుకుతోంది. గత ఏడాది నారు ప్రారంభ ధర రూ.2 వేల నుంచి రూ.2,500 ఉండగా, ఈ ఏడాది ఏకంగా రెట్టింపైందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగితే మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు. ముందుముందు ధర మరింత పెరుగుతుందని కౌలుదారులు ఆశిస్తున్నారు. 2023–24 సీజన్‌లో ఎకరం నారు రూ.17,500 పలకగా, 2024–25 సీజన్‌లో రూ.20 వేలు పలికింది. దీంతో నారుమడుల యజమానులు ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆదాయం పొందారు. పెట్టుబడులు పోను ఎకరాకు సుమారు రూ.15 లక్షల ఆదాయం రావడంతో కౌలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో నారుమడులు వేశారు. మడులను రెండు విడతలుగా కట్టి అమ్మకాలు జరుపుతారు. పెట్టుబడులు రాని రైతులు కూడా ఉంటారు. నారు వ్యాపారం గాలిలో దీపం వంటిదని కౌలుదారులు చెప్పారు. పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండదని అంటున్నారు.
మంచి రేటు పలుకుతోంది
పొగాకు నారుకు మంచి రేటు పలుకుతోంది. ఎకరం నారుకు ప్రస్తుతం వస్తున్న రూ.5 వేల ధర నిలబడితే పెట్టుబడులు పోను కొద్దిపాటి లాభాలతో బయటపడతాం. పదేళ్లుగా నారుమడులు కడుతున్నారు. పెట్టుబడులు రాని రోజులు కూడా ఉన్నాయి. రెండేళ్లుగా నారు వ్యాపారం బాగుంది. కౌలుకు 3.5 ఎకరాలు తీసుకుని, దాదాపు రూ.12 లక్షల పెట్టుబడి పెట్టి, నారుమడులు కట్టాను. మడులు ఆశాజనకంగా ఉన్నాయి. భూమి కౌలు, కూలీల ఖర్చు పెరిగింది. గతంలో కిలో విత్తనం రూ.15 వేలు ఉండేది. రెండేళ్లుగా రూ.25 వేలు పలుకుతోంది. నాట్లు ఊపందుకుంటే నారు రేటు పెరగవచ్చు.
– తంగేళ్ల వేములరాజు,
కౌలు రైతు,
దేవరపల్లి
పెట్టుబడి రూ.4.50 లక్షలు
ఎకరం నారుమడి పెంచడానికి కౌలుతో కలిపి సుమారు రూ.4.50 లక్షల పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనం ఖరీదు రూ.25 వేలు. ఎకరం విస్తీర్ణంలో పోసిన నారు సుమారు 450 ఎకరాల్లో నాటడానికి సరిపోతుంది. నారుమడికి నల్లరేగడి భూములు అనుకూలం. నారుమడులు కట్టి కుబేరులైన రైతులతో పాటు కనీసం పెట్టుబబడులు రాక కుదేలైన రైతులు కూడా ఉన్నారు. ఎక్కువగా ట్రే నారుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీని రేటు ఎక్కువైనప్పటికీ రైతులు కొనుగోలు చేసి నాట్లు వేస్తున్నారు. ఈ నారు కాండం బలంగా ఉండి, చీడపీడలు ఉండవని చెబుతున్నారు. పెద్ద రైతులందరూ సొంతంగా ట్రే నారు సిద్ధం చేసుకున్నారు.

ఆనందంగా ఉన్నారు..

ఆనందంగా ఉన్నారు..

ఆనందంగా ఉన్నారు..