
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పశు సంవర్ధక శాఖ ప్రగతిపై తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు, మండలాల వారీ పురోగతిపై సమీక్షించి, లక్ష్యాలను సమయానుసారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోకులం షెడ్ల లక్ష్యాల సాధనకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటి ప్రకారం మంజూరు తీసుకోవాలని సూచించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో తెల్ల జాతి పశువుల ప్రాధాన్యాన్ని గుర్తించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై పశు ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ, మార్గదర్శకాలు నిరంతరం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి.శ్రీనివాసరావు, శాఖాధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో
పలువురికి పదవులు
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ విభాగాల్లో నియమిస్తూ, పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. చొల్లంగి సత్యగిరి (రాజమహేంద్రవరం రూరల్) బీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగాలకు అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులుగా బండి నాగేశ్వరరావు (రాజమహేంద్రవరం రూరల్), ఆరుగోలను ముసలయ్య(కొవ్వూరు)లను నియమించారు.