
ఆకాశ దీపంతో శుభారంభం
ఫ రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు
శ్రీకారం
ఫ పూర్తయిన ఏర్పాట్లు
అన్నవరం: ఆకాశ దీపం ఏర్పాటు ద్వారా రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు అర్చకులు మంగళవారం శ్రీకారం చుట్టారు. సత్యదేవుని ప్రధానాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. కార్తిక అమావాస్య అయిన నవంబరు 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పాడ్యమి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. కార్తిక అమావాస్య వరకూ వీటిని వెలిగిస్తారు. మార్గశిర పాడ్యమి తెల్లవారుజామున పోలిస్వర్గం దీపాలు వెలిగించి, నదుల్లో వదలడం ద్వారా కార్తిక మాసోత్సవాలు ముగియనున్నాయి. కార్తిక మాసం సందర్భంగా అన్నవరం దేవస్థానంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ ఫార్మాస్యూటికల్స్ చేపట్టిన భక్తుల విశ్రాంతి షెడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే, క్యూ లైన్లు, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ స్థలాలు కూడా సిద్ధం చేశారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో అర్ధరాత్రి 2 గంటల నుంచి మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. అలాగే, స్వామివారి దర్శనాలు కూడా పర్వదినాల్లో అర్ధరాత్రి నుంచి, మిగిలిన రోజుల్లో తెల్లవారుజాము నుంచి ప్రారంభమవుతాయి. వ్రతాలు, దర్శనాల టికెట్లు, ప్రసాదం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక అధికారుల నియామకం
కార్తిక మాసంలో భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడానికి, నవంబరు 2న తెప్పోత్సవం, 5న గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను దేవదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, లోవ తలుపులమ్మ తల్లి, వాడపల్లి దేవస్థానం ఈఓలు పి.విశ్వనాథరాజు, ఎన్‌ఎస్ చక్రధర్‌రావు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి వీరు కార్తిక మాసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.