
ఆలయం.. కార్తిక వైభవం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు నదీ స్నానాలు, దీపారాధనలు, విశేష పూజలు, అభిషేకాలు, దానధర్మాలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ముఖ్యంగా భక్తులు పావన గోదావరి నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి, పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో రద్దీగా మారుతాయి. గోదావరి తీరంలో అనేక ప్రాచీన సుప్రసిద్ధ శివాయాలున్నాయి. ఆయా ఆలయాల్లో కార్తిక మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఫ నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు
ఫ ముస్తాబైన ఆలయాలు
ఫ రేవుల్లో సందడి చేయనున్న భక్తులు
కోటిలింగేశ్వర స్వామి
రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన కోటిలింగాల పేటలో శ్రీ భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం కొలువు తీరింది. ఇది అతి ప్రాచీనమైన, పురాణ ప్రశస్తి ఉన్న ఆలయం. బ్రహ్మదేవుడే విప్రుని వేషంలో వచ్చి, ఇక్కడ కోటిలింగాలు ప్రతిష్ఠించాడని, అందులో ఒక లింగం మాయం కావడంతో మహర్షులు కాశీ క్షేత్రం నుంచి తెచ్చి ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. అదే ఆలయంలో ప్రస్తుతం పూజలందుకుంటున్న కోటిలింగేశ్వర స్వామి శివలింగమని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం ఇక్కడే జరిగింది. కోటిలింగ క్షేత్రానికి అభినవ విరూపాక్ష పీఠమనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది.
మార్కండేయేశ్వర స్వామి
గోదావరి తీరాన ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. మార్కండేయుని భక్తికి మెచ్చి సాక్షాత్కరించిన పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో కొలువు తీరాడని, ఆ స్వామికే మార్కండేయేశ్వరునిగా పేరు వచ్చిందని చెబుతారు. ప్రాచీన కాలంలో ఈ ఆలయం చందా సత్రం ఎదుట ఉన్న మసీదులో ఉండేది. ఈ స్వామికి 1072లో దీపదానం చేసి భీమన ప్రగడ శాసనం చేయించారు. ఈ శాసనం ప్రస్తుతం ఆలయం ఉత్తర ద్వారానికి కుడి వైపు ఉంది. గుండు శోభనాద్రి జమీందారు 1775లో ప్రస్తుతం ఉన్న స్థలానికి తరలించి, కొత్త ఆలయం నిర్మించారు. కార్తిక శుద్ధ పాడ్యమి మంగళవారం సాయంత్రమే రావడంతో మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీపం వెలిగించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆలయం.. కార్తిక వైభవం

ఆలయం.. కార్తిక వైభవం

ఆలయం.. కార్తిక వైభవం