
సమాజ భద్రతకు ప్రతీక పోలీసుల త్యాగం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమాజ భద్రతకు ప్రతీకే పోలీసుల త్యాగమని, వారి సేవాస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన అమరవీరుల దినోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారన్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, ప్రతి ఒక్క పోలీసు సిబ్బందీ ఆత్మ నిబద్ధతతో పని చేయాలని, వారి కుటుంబ సభ్యుల సహకారం విలువైనదని గుర్తించాలని అన్నారు. ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసు వ్యవస్థ మరింత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.చెంచిరెడ్డి, డీఎస్పీలు బి.రామకృష్ణ, వై.శ్రీకాంత్, బి.విద్య, కిషోర్, దేవకుమార్, రవికుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.