
● 2047 నాటికి తీర్చిదిద్దడమే
మోదీ లక్ష్యం
● కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
● దోసకాయలపల్లిలో వికసిత్
భారత్ సంకల్ప యాత్ర
మధురపూడి: భారత్‌ను 2047 నాటికి ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలిపేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర, పౌర విమానయానం, ఉక్కు శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి హైస్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ కోసం అందరం కలసి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే డ్రోన్ వ్యవసాయం తీసుకువచ్చిందని తెలిపారు. డ్రోన్ అక్కా పథకం కింద 17 వేల మంది మహిళలకు డ్రోన్ల ద్వారా విత్తనాలు విత్తడం, ఎరువులు వెదజల్లడం తదితర పనుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. 80 శాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అందిస్తోందని చెప్పారు. పీఎం గరీబ్ కల్యాణ్, పీఎం ఉజ్వల్ యోజన వంటి పథకాలు పేదలకు ఉపయోగపడుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 9.50 కోట్ల మంది మహిళలకు పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరందించే కార్యక్రమం జరుగుతోందని, దేశంలో 37 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్డులు అందించామని వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం, భారత్‌ను వికసిత్ దేశంగా అభివృద్ధి చేసేందుకు కలసి అడుగులు వేద్దామంటూ మంత్రి సింధియా ప్రతిజ్ఞ చేయించారు.
రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి – సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందిెస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా జోడించి వలంటీర్ల ద్వారా అర్హులందరికీ సమర్థవంతంగా సంక్షేమం అందిస్తోందని తెలిపారు.
కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర పథకాలను అర్హులైన అందరికీ అందించడం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని చెప్పారు. తొలుత డ్రోన్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి సింధియాకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌లు వినాయకుని ప్రతిమను బహూకరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఆర్‌డీఓ చైత్రవర్షిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు జానా సత్యనారాయణ, ఎస్.మాధవరావు, గోవింద్, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కంటే వినయ్‌తేజ, ఎంపీడీఓ పీఎస్ నరేష్‌కుమార్, తహసీల్దార్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.