సాక్షి, అమలాపురం: తెలవారకుండానే చీకటిని చీల్చుకుంటూ వేట సాగించేందుకు సమయం రానే వచ్చింది.. ఎగసిపడే కెరటాలను దాటుకుంటూ వెళ్లి మత్స్య సంపదను పట్టుకుని మురిసిపోయే మత్స్యకార జీవనం మళ్లీ మొదలు కానుంది. వేట నిషేధ సమయంలో ముగియడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది.. రెండు నెలలుగా తీరంలో వేట బోట్లకు లంగరు వేసి కూర్చున్న కోనసీమ మత్స్యకారుల ఇళ్లలో సందడి మొదలైంది. వేట నిషేధ సమయం దాటిపోవడంతో గోదావరి పాయల వెంబడి ఉన్న ఫిషింగ్ హార్బర్లు.. తీరాన్ని ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో వేటకు సన్నాహాలు మొదలయ్యాయి. బోట్లకు చివరి మెరుగులు దిద్దుతూ కొందరు.. వలలు సిద్ధం చేసుకుంటూ మరి కొందరు మత్స్యకారులు ఉన్నారు. బంగాళాఖాతం తీరంలో రెండు నెలల పాటు సాగిన వేట నిషేధం ఆదివారం అర్ధరాత్రితో ముగిసిపోతోంది. నిషేధ సమయం దాటిన వెంటనే వేటకు వందలాది మర బోట్లపై.. వేలాది మంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు.
జిల్లాలో అంతర్వేది తీర్థాల మొండి నుంచి ఐ.పోలవరం భైరవపాలెం వరకూ విస్తారంగా ఉన్న సముద్ర తీరంలో గత ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి వేట నిషేధం అమలులోకి వచ్చింది. 61 రోజుల తరువాత ఆదివారం అర్ధరాత్రితో గడువు ముగిసింది. చేపల పునరుత్పత్తి (గుడ్లు పొదిగి పిల్లలు తయారయ్యే సమయం) జరిగే సమయంలో చేపల వేట సాగిస్తే మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుంది. చేపల పునరుత్పత్తికి ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు అనువైన సమయం. అప్పుడు వేట చేస్తే గుడ్లు ఉన్న చేపలు వేటకు బలవుతున్నాయి. చేపల వేట గతంలో అంగుళం, అర అంగుళం వలలతో వేట సాగేది. చిన్న చేపలు తప్పించుకునేవి. కానీ ఇటీవల రింగు వలలు (సూక్ష్మ కన్నాలు ఉండే వల) వాడుతున్నారు. దీనివల్ల చిన్న చేప తప్పించుకునే అవకాశం ఉండడం లేదు. దీనిని మత్స్య శాఖ నిషేధించినా ఎక్కువగా వీటినే వాడుతున్నారు. ఇలా పర్యావరణానికి సైతం ముప్పు అని చెబుతున్నా, కొంతమంది లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో చేపల పునరుత్పత్తి సమయంలో వేట నిషేధం ద్వారా మత్స్య సంపద పెంపునకు అవకాశం ఉంటుందని నిపుణుల సూచనల ప్రకారం మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని రూపొందించారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు వేట నిలిచిపోనుంది. గతంలో 45 రోజులు ఉండేది. ఈ సమయం కూడా సరిపోదని సముద్ర శాస్త్రవేత్తలు చెప్పడంతో ఇది కాస్తా పెంచారు. ఈ కారణంగానే ఈ రెండు నెలల పాటు వేటను ఆపేస్తున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా తెప్పల మీద వెళ్లి, అది కూడా తీరానికి కిలోమీటరు పరిధిలో వేట సాగించవచ్చు. అయితే జిల్లాలో గోదావరి నదీపాయలలో మాత్రం వేట కొనసాగుతోంది.
మళ్లీ సముద్రంలోకి బోట్లు
జిల్లాలో ఏటా చేపల వేట నిషేధంతో సుమారు 1,700కు పైగా బోట్లు తీరంలో నిలిచిపోతున్నాయి. వీటిపై పది మండలాలకు చెందిన మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలకు చెందిన మత్స్యకారులకు వేటే జీవనాధారం. ఇలా జిల్లాలో 19,426 మత్స్యకార కుటుంబాలు వేటపై జీవనం సాగిస్తున్నారని అంచనా. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, అల్లవరం మండలం ఓడలరేవు, నక్కా రామేశ్వరం, మామిడికుదురు మండలం కరవాక, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, ఎస్.యానాం, కాట్రేనికోన మండలం చిర్ర యానాం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటిమొగ, భైరవపాలెం, గాడిమొగ గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్ర వేటపై జీవనం సాగిస్తున్నారు. సముద్ర వేట నిషేధ సమయం ముగియవడంతో వాళ్లంతా వేటకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సముద్రంలోకి బోట్లు వెళ్లనున్నాయి.
ఆదివారం అర్ధరాత్రి నుంచి
ముగిసిన వేట నిషేధం
61 రోజుల తర్వాత
మళ్లీ సముద్రంలోకి బోట్లు
సన్నద్ధతలో మత్స్యకారులు


