వేసవిలో పుచ్చకాయలకు గిరాకీ
ముమ్మిడివరం: ఆరోగ్యాన్ని, చల్లదనాన్ని అంది‘పుచ్చ’కునే సమయమిదే.. ప్రతి వేసవిలో వచ్చే వాటర్ మిలాన్ (పుచ్చ కాయ)కు ఎనలేని డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలకు యమ గిరాకీ వచ్చింది. ప్రస్తుతం ఈ కాయ ధర సైజును బట్టీ రూ.100 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. వివిధ పనుల రీత్యా బయటకు వచ్చిన వారికి ఎండ నుంచి తక్షణ ఉపశమనం అందించే సాధనం ఇది. సాధారణంగా వేసవిలో శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతుంటాయి. తద్వారా డీ హైడ్రేషన్, వడదెబ్బకు గురవుతుంటారు. అందుకే శరీరంలో వాటర్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, బీ విటమిన్, విటమిన్–ఏ, విటమిన్–బీ6, విటమిన్–సీ, సుక్రోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు తదితరాలు ఉంటాయి. ఇవి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుచ్చకాయ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మల బద్ధకం రాకుండా చేస్తోంది. వృద్ధాప్యంలో అంధత్వం నివారిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది. వీటిని చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. కోనసీమలోని అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాలు, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని ప్రధాన మార్కెట్లలో రోడ్ల పక్కన దుకాణాలు, తోపుడు బండ్లలో వీటిని విక్రయిస్తున్నారు. కిలో పుచ్చకాయ రూ.25 నుంచి రూ.30 పలుకుతుంది.


