● వేసవి దుక్కులతో భూమికి దన్ను
● మెట్ట ప్రాంత పొలాలకు మరింత మేలు
రంగంపేట: మండే ఎండను పండే పంటకు ఉపయోగించుకోవచ్చు.. ఖాళీగా వదిలేస్తే కలిసొచ్చేది లేదు.. రబీ పూర్తవ్వడంతో ఈ సమయంలో పొలాలను అలాగే వదిలేయకుండా, కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా రానున్న ఖరీఫ్‌లో మంచి ఫలితాలను రాబట్టుకునే వీలుంటుంది. ఈ సమయంలో లోతు దుక్కి చేయడం ఫలితాలను ఇస్తుంది. సాగు చేయబోయే పంట కోసం ఇప్పటి నుంచి సాధారణంగా కల్టివేటర్ (ట్రాక్టర్‌కు వాడే మామూలు నాగలి) బదులుగా లోతు దుక్కి దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడితే నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురికాకుండా తేమ పెరుగుతుంది. ఎక్కువ కాలం తేమ తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి పొలంలో నాటుకుపోతాయి. దానివల్ల రానున్న పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పొలంలో వేసవిలో దుక్కులు చేయాలి.


