ఇదేం చెత్త శిక్షణ! | - | Sakshi
Sakshi News home page

ఇదేం చెత్త శిక్షణ!

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

60 మందికి మూడు

రోజుల ‘సమీక్ష’

జిల్లాలోని 19 మండలాల్లో 344 గ్రామ పంచాయతీలు, 439 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 01 నుంచి పదో తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా తడి, పొడి చెత్తపై నిర్వహించిన ఐఆర్‌వీ సర్వేలో 60 గ్రామాల్లో ప్రజాభిప్రాయం ప్రతికూలంగా వచ్చింది. ఆ గ్రామాల్లో పారిశుధ్యంపై 50 శాతంలోపే సానుకూల అభిప్రాయం చెప్పారు. దీంతో సంబంధిత కార్యదర్శులకు అమలాపురం రూరల్‌ మండలంలోని అనాతవరంలో మూడు రోజుల పాటు సమీక్ష పేరు చెప్పి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం రేకుల షెడ్‌లో సమావేశాలను ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శులందరినీ పారిశుధ్య కార్మికులతో కలిసి ఇంటింటికీ తిప్పించి తడి, పొడి చెత్తను దగ్గరుండి సేకరించేలా చేశారు. చెత్తను విభజించి డంప్‌ యార్డుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామంలో ర్యాలీలు నిర్వహించి గ్రామ కార్యదర్శుల సహనాన్ని పరీక్షించారు. కూటమి ప్రభుత్వంలో కార్యదర్శులకు విలువ లేదని, కరివేపాకులా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

గ్రామ కార్యదర్శులకు

తలనొప్పిగా ఐవీఆర్‌ సర్వే

80 శాతం సానుకూలత లేకుంటే

చెత్త సేకరణపై అవగాహన

జిల్లాలో 60 మందికి

ఇప్పటికే ‘క్లాసు’లు పూర్తి

ప్రభుత్వంపై పోరుబాటా.. నిరసన

తెలపాలా అని ఉద్యోగుల తర్జనభర్జన

ఆలమూరు: ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌కు చేరింది. లేనిది ఉన్నట్టు మోళీ చేసి చూపించడంలో చంద్రబాబు ప్రభుత్వం లెక్కే వేరు. ఏదేమైనా సరే ఐవీఆర్‌ కాల్స్‌లో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి 80 శాతం అనుకూలంగా ఉండాల్సిందేనని అనధికార ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలకు అధికారులు బలవుతుండగా, ప్రజాగ్రహానికి కార్యదర్శులు జవాబుదారులవుతున్నారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ సాధనకు నిధులు మంజూరు చేయకుండా, చాలినంత మంది పారిశుధ్య కార్మికులను నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం ‘చెత్త’ పాలన చేస్తోంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీస వసతులు, సౌకర్యాలు లేకపోయినా గ్రామ కార్యదర్శుల నేతృత్వంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు స్వర్ణాంధ్ర–స్వర్ణ దివస్‌ దిశగా గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్మికుల సహకారంతో సంపూర్ణ పారిశుధ్యం దిశగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామానికి ఒకటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన స్వచ్ఛ రథం గ్రామస్థాయి అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అనేక గ్రామాల్లో డంప్‌ యార్డులు లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం నెలకొల్పి అంటువ్యాధుల నుంచి విముక్తిని కల్పించేందుకు ప్రయత్నిస్తున్న గ్రామ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అభినందన పూర్వకంగా కాకుండా కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే పనిష్మెంట్‌ను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరిస్తోంది.

శిక్షలకు ఐవీఆర్‌ ప్రామాణికం

అమరావతి నుంచి ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై ప్రజలకు ఐవీఆర్‌ ద్వారా ఫోన్లు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ ప్రశ్నావళికి ఎవరైనా ప్రతికూల సమాధానం లేదా వారడిగిన నంబర్లలో ప్రతికూల ఫలితాన్నిచ్చే నంబర్‌ నొక్కితే దాని ఆధారంగా ప్రభుత్వం సర్వే చేసుకుంటుంది. వాటిలో ప్రజాభిప్రాయం 80 శాతం అనుకూలంగా లేకుంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటోంది. దీనిపై కనీసం గ్రామ కార్యదర్శుల వివరణ తీసుకోకపోవడంపై వారు మనోవేదనకు గురవుతున్నారు.

ఈసారి ఫెయిలైతే రాయలసీమలో!

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21 నుంచి 30 వరకూ మరో విడత ఐవీఆర్‌ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో అనుకున్న ఫలితాలు రాక పారిశుధ్య విభాగంలో విఫలమైన గ్రామ కార్యదర్శులకు ఈసారి ‘శిక్ష’ణ రాయలసీమ జిల్లాలో ఉంటుందని జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే అనాతవరంలో అమలు చేసిన శిక్ష మరువక ముందే మళ్లీ రాయలసీమలో శిక్షణ ఏంటని కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాల కల్పించకుండా సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి మండుటెండలో తిప్పించి చెత్త సేకరణ పనిని అప్పగించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై న్యాయ పోరాటం చేయాలా, లేదా ప్రభుత్వానికి నిరసన తెలపాలా అనే ఆలోచనలో కార్యదర్శులు ఉన్నట్టు తెలుస్తోంది.

పారిశుధ్య నిర్వహణపై లోతుగా అధ్యయనం

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో లోపాలు తెలుసుకునేందుకు ఐవీఆర్‌ సర్వే జరుపుతున్నాం. తడి చెత్త–పొడి చెత్త సేకరణపై లోతుగా అధ్యయనం చేసేందుకు వీలుగా గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లో మళ్లీ ఐవీఆర్‌ సర్వే చేస్తున్నాం. ఆ మేరకు కార్యదర్శులపై చర్యలు తీసుకుంటాం.

– డి.శాంతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement