భౌరవ నరకం | - | Sakshi
Sakshi News home page

భౌరవ నరకం

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

హడలెత్తిస్తున్న శునకాలు

ఏడాదిలో 2,198 మంది

కుక్కకాటు బాధితులు

భౌపెడుతున్న కరుపులు

రాయవరం: వీధికుక్కను చంపకండి, వాటికి ఆపరేషన్లు చేయించి సంతతి పెరగకుండా చూడండి. ప్రజలను కరిచినా రేబిస్‌ సోకకుండా వాటికి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వ్యాక్సిన్‌ వేయించండి..ఇవి జీవకారుణ్య సంఘం నేతలు చేస్తున్న సూచనలు. మా పంచాయతీ పరిధిలో వీధికుక్కలు బాగా ఎక్కువయ్యాయి. కుక్కల నిర్మూలన చేయాలని ప్రజలు మాపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వాటి సంతతి పెరగకుండా ఆపరేషన్లు చేయండి. ఇది పంచాయతీ కార్యదర్శులు, పశువైద్యులకు చేస్తున్న విజ్ఞప్తి. కుక్కలను పట్టుకుని మా వద్దకు తీసుకొస్తే ఆపరేషన్లు చేస్తాం. ప్రతీ ఆరు నెలలకు వాటికి వ్యాక్సిన్‌ వేయించాలంటున్నారు పశువైద్యులు. ఇలా ఎవరికి వారు శునకాలను నియంత్రించడంలో గిరి గీసుకోవడంతో వాటిని పట్టేదెవరు.. అరికట్టేదెవరు అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీరవిహారం

పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు రోడ్డుపై అడుగు పెట్టాలంటే వణికిపోతున్నారు. శునకాల సంఖ్యను నియంత్రించాల్సిన పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలు చేతులెత్తేస్తున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. శునకాలకు పునరుత్పత్తి నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది నుంచి సంతానోత్పత్తి

ఒక కుక్క జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. పుట్టిన ఏడాది తర్వాత కుక్కలు సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. వీటి గర్భావధి కాలం రెండు నెలలు. ఒక కాన్పులో 5 నుంచి 8 వరకు పిల్లలకు జన్మనిస్తుంది.

రేబిస్‌తో ప్రమాదం

రేబిస్‌ వ్యాధి సోకిన కుక్క మరో కుక్కను, జంతువును, మనిషిని కరచినప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డ తర్వాత చికిత్సలు లేవు. 95 శాతం మనుషుల్లో సంభవించే రేబిస్‌కు కుక్కకాటు ప్రధాన కారణం.

ఈ జాగ్రత్తలు పాటించాలి

● కుక్కకాటుకు గురైతే మంచినీటిని ఉపయోగించి కార్బోలిక్‌ లేదా డెట్టాల్‌ సబ్బుతో 10–15 సార్లు నురుగు వచ్చేటట్టు కడగాలి.

● గాయంపై ఐస్‌ ముక్కలను ఉంచడం వల్ల వైరస్‌ కదలికలను తగ్గించవచ్చు.

● తల భాగంలో కరిస్తే గంట లోపు వ్యాక్సిన్‌ వేయించాలి. ఒక డోసు కండకు, ఒక డోసు వెన్నుపూసలోకి ఇవ్వాలి.

● కుక్క కరిచిన రోజు, మూడు, ఏడు, 14, 28 రోజులకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి.

● యజమానులు వారి కుక్కలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి.

● పశువుల ఆస్పత్రిలో ఉచితంగా పశువులకు ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. మనుషులతో పాటు పశువులు కూడా కుక్కకాటు బారిన పడుతున్నట్టు రైతులు వాపోతున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ..

జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 2,198 మందికి కుక్కకాటు బారిన పడ్డారు.

ఉచితంగా ఇంజెక్షన్లు

అన్ని పశువైద్య శాలల్లో ఉచితంగా యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్లు వేస్తారు. కుక్కకాటుకు గురైన పశువు ఇచ్చే పాలను కాచుకుని మాత్రమే తాగాలి.

– డాక్టర్‌ మక్కిన వెంకటేశ్వరరావు,

డిప్యూటీ డైరెక్టర్‌, పశు సంవర్ధక శాఖ,

రాజమహేంద్రవరం

వెంటనే వైద్యం చేయించుకోవాలి

కుక్క కాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

– డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, రాజమహేంద్రవరం.

Advertisement
 
Advertisement
Advertisement