జేసీ నిడియాదేవి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జేసీ నిడియాదేవి బాధ్యతల స్వీకరణ

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

అమలాపురం రూరల్‌: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా వైఖోమ్‌ నిడియా దేవి గురువారం కలెక్టరేట్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. జేసీ చాంబర్‌లో వేదాశీర్వచనాల అనంతరం ఆమె పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. మణిపూర్‌కు చెందిన ఆమె 2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. కడప జిల్లా రాజంపేటకు సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జేఏడీ విభాగంలో పనిచేసి జేసీగా పదోన్నతి పొందారు. నిడియా దేవి భర్త మేఘ స్వరూప్‌ రాజమహేంద్రవరంలో జేసీగా పనిచేస్తున్నారు. భార్యభర్తలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. డీఎస్‌ఓ అడపా ఉదయభాస్కర్‌, పౌరసరఫ రాల జిల్లా మేనేజర్‌ పి.శ్రీనివాస్‌, ఎల్‌డీ ఎం.కేశవవర్మ, కలెక్టరేట్‌ ఏవో కడలి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

జిల్లాలో డీజిల్‌ కొరత లేదు

డీఎస్‌ఓ ఉదయ భాస్కర్‌

అమలాపురం రూరల్‌: జిల్లాలో డీజిల్‌ కొరత లేదని, చమురు కంపెనీల డిపోల నుంచి బంకులకు క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌ గురువారం తెలిపారు. ఎవరూ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రైతుల సాగు పనులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన డీజిల్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు 20 లీటర్ల చొప్పున ఆయిల్‌ క్యాన్లలో డీజిల్‌ సరఫరా చేయనున్నామని, అయితే రైతు అనే ధ్రువీకరణ బంకు యాజమాన్యానికి చూపాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్థానిక రెవెన్యూ కార్యాలయంలో లేదా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఉదయ భాస్కర్‌ సూచించారు.

నంది వాహనంపై

వీరేశ్వరుని ఊరేగింపు

ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో నాలుగో రోజు గురువారం గవ్యాంతం, చండీ హోమం, కళా హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం నంది వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. సదస్యం, పండిత పూజ, పండిత సత్కారాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ దాట్ల రామకృష్ణం రాజు, కమిషనర్‌, ఈఓ వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఫీజు చెల్లించలేదని

వైవాకు అనుమతి నిరాకరణ

బాలాజీచెరువు (కాకినాడ): పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులు గురువారం మధ్యాహ్నం కళాశాల ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. కళాశాలకు సంబంధించి ఫీజు చెల్లించకపోవడంతో వైవా పరీక్షలకు అనుమతించలేదంటూ నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు ధర్నా అనంతరం ప్రిన్సిపాల్‌ అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. మూడేళ్లుగా ఇక్కడ డిగ్రీ కోర్సు అభ్యసించి కనీసం ఒక ఏడాదికై నా ఫీజు చెల్లించకుండా మూడేళ్లు బకాయి పెట్టడం తగదని, కళాశాలలో పనిచేస్తున్న అఽతిథి, కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, ఇతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం కష్టంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement