మధ్యాహ్న భోజనానికి.. ప్రైవేటు ఎసరు! | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనానికి.. ప్రైవేటు ఎసరు!

Apr 23 2026 8:00 AM | Updated on Apr 23 2026 8:00 AM

కుక్‌, హెల్పర్ల ఉపాధికి గండి

విద్యార్థులకు వేడివేడిగా వండి పెట్టడానికి మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు ఆలస్యమైనా సొంత డబ్బుతో నిత్యావసర సరకులు కొనుగోలు చేసి, వంటలు చేసి పిల్లలకు ఆకలి తెలియకుండా భోజనం వండి వడ్డిస్తున్నారు. స్మార్ట్‌ కిచెన్‌ విధానంతో ప్రస్తుతం కుక్‌ అండ్‌ హెల్పర్స్‌గా పనిచేస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచిన మహిళల ఉపాధికి గండి పడనుంది. ప్రతీ స్కూలులో ఒకరిద్దరికి భోజనం వడ్డించేందుకు అవకాశం కల్పిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతీ స్కూలులో విద్యార్థుల సంఖ్యను బట్టి ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ఉపాధి పొందుతున్నారు. ఒకరిద్దరికే అవకాశం కల్పిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అని పలువురు వాపోతున్నారు. ‘రూ.3 వేల వేతనం కూడా ప్రతి నెలా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగ పెట్టినట్టు నాలుగైదు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. వడ్డించే పని కూడా ఉపాధ్యాయులకే అప్పగిస్తార’ని పలువురు కుక్‌లు వ్యాఖ్యానించారు.

వడివడిగా

చంద్రబాబు ప్రభుత్వం అడుగులు

స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

2,467 మంది కుక్‌,

హెల్పర్ల ఉపాధికి గండి

వేడి వేడి భోజనానికి విద్యార్థులు దూరం

24న కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు

ఎండీఎం కార్మికులు సమాయత్తం

కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి పిల్లలు కడుపారా భోజనం చేసి, శ్రద్ధగా చదువుకోవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేశారు. వారంలో ఆరు రోజులూ విభిన్న పోషకాలతో కూడిన కూరలతో భోజనం వడ్డించేలా గోరుముద్ద పథకాన్ని అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. అయితే డొక్కా సీతమ్మ పేరును చెడగొట్టేలా కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ పరం చేయడానికి అడుగులు వేస్తోంది. ఇంతవరకూ వంట ఏజెన్సీలతో పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్ల పేరుతో వారి పొట్టకొట్టడానికి సిద్ధమై పోయిది. గతంలో కుక్‌లకు రూ.1,000 గౌరవ వేతనంగా అందించేవారు. ఆ మొత్తం వారికి ఏమాత్రం సరిపోదని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేలకు పెంచారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుక్‌ అండ్‌ హెల్పర్ల కుటుంబాలను రోడ్డున పడేసేలా స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది.

ఇదీ లెక్క..

ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,551 పాఠశాలలు ఉండగా 86,817 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు పని చేస్తున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి మొత్తం 2,467 మంది కుక్‌లు, హెల్పర్లు పనిచేస్తున్నారు.

స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

విద్యాశాఖాధికారులు జిల్లాలో స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటుకు ప్రతి పాదనలు పంపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 1, పెద్ద మండలం అయితే 2 స్మార్ట్‌ కిచెన్ల చొప్పున ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇంతవరకు ఐ పోలవరం, కె.గంగవరం, మండపేట, రామచంద్రపురం మండలాల్లో 6 పాఠశాలలను స్మార్ట్‌ కిచెన్‌లకు ఎంపిక చేశారు. మిగిలిన మండలాల్లో ఎంఈఓ – 2లు పాఠశాలలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ఈ స్మార్ట్‌ కిచెన్లను సిద్దం చేసి వాటి ద్వారానే మధ్యాహ్న భోజనం పంపిణీ చేయబోతున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ స్మార్ట్‌ కిచెన్‌లు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక పిల్లలకు చల్లారిన అన్నమే..

ఇంతవరకూ వేడివేడిగా భోజనం చేసిన విద్యార్థులకు స్మార్ట్‌ కిచెన్ల వ్యవస్థ అర్ధాకలినే మిగల్చబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో రోజుకు సగటున 81,531 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. స్మార్ట్‌ కిచెన్లు ఏర్పాటు చేస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. మండల పరిధిలో ఒక కేంద్రంలో వంటశాల ఏర్పాటు చేసి. అక్కడ చేసిన వంటలను పాఠశాలలకు పంపుతారు. దీంతో చల్లారిపోయిన అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

24, 27 తేదీల్లో ధర్నాలు

ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాం. ఈ నెల 24న కలెక్టరేట్‌ వద్ద, 27న విజయవాడలో ధర్నాలు నిర్వహిస్తాం.

– టి.నాగవరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా యూనియన్‌, అమలాపురం

ప్రభుత్వమే నిర్వహించాలి

ప్రైవేట్‌ సంస్థలు సేవాభావంతో పనిచేయవు. ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహించాలి. నిత్యం అధికారుల పర్యవేక్షణలో నడిపించాలి.

– ఎస్‌.జ్యోతిబసు,

కార్యదర్శి, యూటీఎఫ్‌, రావులపాలెం

Advertisement
 
Advertisement
Advertisement